Lokesh – Modi: మోదీతో లోకేశ్ భేటీ వెనుక… కథేంటి?

టీడీపీ (TDP) యువనేత, మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఇటీవల తరచుగా ప్రధాని మోడీతో (PM Modi) సమావేశమవుతున్నారు. ఆ సమావేశం వివరాలేవీ బయటకు రావట్లేదు. పైగా లోకేశ్ ఢిల్లీ పర్యటన (Delhi tour) వివరాలను కూడా పార్టీ పెద్దగా ప్రచారం చేయట్లేదు. అదొక సాదాసీదా మీటింగ్ మాత్రమే అన్నట్టు చెప్పుకుంటున్నారు. అయితే సాదాసీదా మీటింగ్ ల కోసం టైం వేస్ట్ చేసుకునేంత స్థాయి ప్రధానిది కాదు. ఆయన చాలా బిజీ. అయినా ఓ రాష్ట్రానికి చెందిన మంత్రి లోకేశ్ కు అంత టైం కేటాయించి ప్రధాని సమావేశమవుతున్నారంటే, ఈ సమావేశాల వెనుక ఇంకేదో ఉందంటున్నారు విశ్లేషకులు.
ఔనన్నా కాదన్నా టీడీపీ భవిష్యత్ నేత నారా లోకేశ్. చంద్రబాబు తర్వాత ఎవరంటే లోకేశ్ తప్ప మరో పేరు వినిపించదు. ఇప్పటికే ఆయన పార్టీలో, ప్రభుత్వంలో పట్టు సంపాదించారు. టీడీపీ కేడర్ మొత్తం లోకేశ్ జపమే చేస్తోంది. పార్టీ యంత్రాంగాన్ని ఏకతాటిపై నడిపిస్తున్నారు. అవసరమైతే తప్ప చంద్రబాబు జోక్యం చేసుకోవట్లేదు. ఇక ప్రభుత్వంలో కూడా అడపాదడపా లోకేశ్ నేరుగా జోక్యం చేసుకుంటున్నారు. కేబినెట్ సమావేశాలకు ముందు మంత్రులతో కూడా ముచ్చటిస్తున్నారు. ఇక ఎమ్మెల్యేలతో నిత్యం టచ్ లో ఉంటూ గైడ్ చేస్తున్నారు. ఇలా అటు పార్టీపైన, ఇటు ప్రభుత్వంపైన లోకేశ్ తనదైన ముద్ర వేసుకున్నారు.
చంద్రబాబు కూడా లోకేశ్ ను తన వారసుడిగా జాతీయ స్థాయి నేతలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. అందుకే అడపాదడపా ఢిల్లీకి పంపించి అక్కడి మీడియాతో మాట్లాడిస్తున్నారు. లోకేశ్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ఎన్డీయే పక్షాల నేతలను కలుస్తున్నారు. కేంద్ర మంత్రులను కలిసి తనను తాను పరిచం చేసుకుంటున్నారు. ఆయా నేతలతో పరిచయాలు పెంచుకుంటున్నారు. తద్వారా తనను తాను ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది లోకేశ్ కి అవసరం. చంద్రబాబు కొడుకుగా ఉంటే సరిపోదు. తను కూడా రాజకీయాలు చేయగలననే కాన్ఫిడెన్స్ ను అందరిలో కలగజేయాలి. ఏపీలో ఇప్పుడు లోకేశ్ దమ్మున్న లీడర్ అనిపించుకున్నారు. ఇప్పుడు జాతీయస్థాయిలో కూడా లోకేశ్ ఆ పేరు తెచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఆ ప్రయత్నంలోనే లోకేశ్ ఉన్నారు.
అయితే లోకేశ్ కు బీజేపీ అగ్రనాయకత్వం ఈ స్థాయి ప్రయారిటీ ఇవ్వడం వెనుక భవిష్యత్ లక్ష్యాలున్నాయి. టీడీపీ ఏపీలో మంచి పట్టున్న పార్టీ. ఇలాంటి పార్టీతో దీర్ఘకాల స్నేహం ఉంటే తమకు ఉపయోగపడుతుంది. అందుకే లోకేశ్ లాంటి యువనేతకు మోదీ, అమిత్ షా (Amit Shah) లాంటి వాళ్లు ప్రయారిటీ ఇస్తున్నారు. అడగ్గానే కలుస్తున్నారు. లేకుంటే ఓ రాష్ట్ర మంత్రికి ఈ స్థాయి నేతలు కలవాల్సిన అవసరం ఉండదు. లోకేశ్ కూడా బీజేపీ హైకమాండ్ అడుగుజాడల్లో నడుస్తున్నారు. బీజేపీకి తాము నమ్మకమైన మిత్రులం అని అడుగడుగునా చాటిచెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది అటు బీజేపీకి, ఇటు టీడీపీకి ఎంతో మేలు చేస్తుంది.