Nara Lokesh: శ్యామ్ మెటాలిక్స్ ఎండి షీజిత్ అగర్వాల్ తో మంత్రి లోకేష్ భేటీ
ఎపిలో డౌన్ స్టీమ్ స్టీల్ ప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటుచేయండి
విశాఖపట్నం: శ్యామ్ మెటాలిక్స్ & ఎనర్జీ లిమిటెడ్ (SMEL) ఎండి షీజిత్ అగర్వాల్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. డైవర్సిఫైడ్ మెటల్స్, ఎనర్జీ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న శ్యామ్ మెటాలిక్స్… రూ.30వేలకోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ తో దేశవ్యాప్తంగా 5వేలమంది నిపుణులైన సిబ్బంది కలిగి ఉంది. ఆసియా, యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ఒరిస్సా, పశ్చిమబెంగాల్, మహారాష్ట్రాల్లో మ్యాను ఫ్యాక్చరింగ్ హబ్ లు, స్టీల్, అల్యూమినియం ఫ్లాట్ ప్రొడక్ట్స్, ఫెర్రో అల్లాయ్స్, పవర్ జనరేషన్ యూనిట్లు కలిగి ఉంది. మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై శ్యామ్ మెటాలిక్స్ సంస్థ దృష్టిసారించింది.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… ఎపిలో వ్యాల్యూయాడెడ్ డౌన్ స్ట్రీమ్ స్టీల్ ప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ప్రస్తుతం ఎపిలో పరిశ్రమల ఏర్పాటుకు పూర్తిస్థాయి అనుకూలమైన వాతావరణం నెలకొని ఉంది. అనకాపల్లి సమీపంలో ఆర్సెలర్స్ మిట్టల్ సంస్థ రూ.1.35లక్షల కోట్లతో దేశంలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పాటుచేస్తోంది. ఇక్కడ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తిచేశారు. రాబోయే అయిదేళ్లలో రూ.2,500 కోట్లతో తమ సంస్థను విస్తరించాలని భావిస్తున్నాం, ఎపి ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పారు.






