Kandula Durgesh: పర్యాటకంలో 17,973 కోట్ల పెట్టుబడులు…మంత్రి దుర్గేశ్
వైజాగ్ లో జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సులో పర్యాటక రంగానికి సంబంధించి రూ.17,973 కోట్ల పెట్టుబడులతో 104 ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ (Kandula Durgesh) వెల్లడించారు. వీటి ద్వారా హోటళ్లలో కొత్తగా 10,690 గదులు అందుబాటులోకి రానున్నాయన్నారు. ఈ ఒప్పందాల వల్ల ప్రత్యక్షంగా 34,406 మందికి, పరోక్షంగా 63,470 మందికి ఉపాధి లభించనుందని పేర్కొన్నారు. ‘తీర ప్రాంతం-పర్యాటక రంగ అభివృద్ధి’ అనే అంశంపై జరిగిన సెమినార్లో ఆయన మాట్లాడుతూ గత 15 నెలల్లో రూ.12 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, తాజా ఒప్పందాలతో రూ.30 వేల కోట్లకు చేరుకున్నాయన్నారు. కోస్తా తీరంలో మూడు పర్యాటక సర్క్యూట్లను గుర్తించామని, వాటి అభివృద్ధికి ప్రైవేటు భాగస్వామ్యం తీసుకుంటామని తెలిపారు. సుందరమైన బీచ్‌లు, సాహస క్రీడలు, క్రూయిజ్ టూరిజం, వెల్నెస్ సెంటర్లు వంటి సదుపాయాలు అందుబాటులోకి వస్తాయన్నారు. నదుల్లో క్రూయిజ్‌లు నడిపే అవకాశాలు పరిశీలిస్తున్నామన్నారు. మైస్ (మీటింగ్‌లు, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్స్‌లు, ఎగ్జిబిషన్లు) కేంద్రంగా విశాఖను అభివృద్ధి చేస్తామన్నారు.
ర్యాపిడో సహాయ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి మాట్లాడుతూ.. పర్యాటకులకు అన్ని వసతులు కల్పించేలా పర్యాటక శాఖతో కలిసి వన్ టికెట్-వన్ క్లిక్ విధానం అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. పర్యాటక రంగంలో రూ.10 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు స్కూల్ ఆఫ్ టూరిజం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ప్రాజెక్ట్స్ సంస్థ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థ సీఈవో లాస్య ఓడూరు మాట్లాడుతూ టూరిజం పారిశ్రామికవేత్తల కోసం ఏఐ ఆధారిత ఆన్లైన్ వేదికను ఆవిష్కరించామన్నారు. పర్యాటకంలో మంచి అవకాశాలు ఉండే ప్రాజెక్టులు, ఆలోచనలు, డిజైన్లకు సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచుతామన్నారు. టూరిజం మంత్రి సమక్షంలో పలువురు ఇన్వెస్టర్లు ఒప్పందాలు చేసుకున్నారు.






