Kota Vinutha: జనసేన నుంచి కోట వినుత బహిష్కరణ.. డ్రైవర్ హత్యకేసులో అరెస్ట్..!

తిరుపతి (Tirupati) జిల్లా శ్రీకాళహస్తి (Sri Kalahasthi) నియోజకవర్గ జనసేన (Janasena) ఇన్‌ఛార్జ్ కోట వినుతను (Kota Vinutha) పార్టీ నుంచి బహిష్కరించినట్లు ఆ పార్టీ ప్రకటించింది. చెన్నైలో జరిగిన ఓ హత్య కేసులో కోట వినుత, ఆమె భర్త చంద్రబాబు అరెస్టయ్యారు. శ్రీకాళహస్తికి చెందిన రాయుడు అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఇతను వినుత దగ్గర డ్రైవర్‌గా పనిచేసినట్లు పోలీసులు గుర్తించారు. రాయుడును వీళ్లే హత్య చేశారని, తమ వద్ద ఆధారాలున్నాయని తమిళనాడు పోలీసులు చెప్తున్నారు. వీళ్లను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. జనసేన పార్టీలో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
చెన్నైలోని కూవం నదిలో శ్రీకాళహస్తి మండలం బక్కిసంపాలెం గ్రామానికి చెందిన శ్రీనివాసులు అలియాస్ రాయుడు అనే యువకుడి మృతదేహాన్ని తమిళనాడు పోలీసులు గుర్తించారు. రాయుడు గతంలో కోట వినుత వద్ద డ్రైవర్‌గా పనిచేసినట్లు తెలుస్తోంది. ఈ హత్య కేసులో వినుత, ఆమె భర్త చంద్రబాబు సహా మొత్తం ఐదుగురు నిందితులను చెన్నైలోని సెవెన్ వెల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు, వారిని విచారణ జరుపుతున్నారు.
కోట వినుత వ్యవహారశైలి జనసేన పార్టీ విధానాలకు విరుద్ధంగా ఉందని, గత కొంతకాలంగా ఆమెను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచినట్లు జనసేన నాయకత్వం పేర్కొంది. చెన్నైలో హత్య కేసులో ఆమెపై ఆరోపణలు రావడంతో, పార్టీ ప్రతిష్ఠకు భంగం కలగకుండా తక్షణమే ఆమెను బహిష్కరించాలని నిర్ణయించినట్లు జనసేన జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ తిరుపతిలో మీడియాతో వెల్లడించారు. ఈ బహిష్కరణ నిర్ణయాన్ని జనసేన అధిష్ఠానం ఒక లేఖ ద్వారా అధికారికంగా ప్రకటించింది. కార్యకర్తలు, నాయకులు నీతి, నిజాయితీతో వ్యవహరించాలని పార్టీ భావిస్తుందని, ఈ ఘటన పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకమని పేర్కొంది. కోట వినుత బహిష్కరణ వెనుక ఆమెపై వచ్చిన నేరారోపణలతో పాటు, పార్టీలో ఆమె చేపట్టిన కొన్ని కార్యక్రమాలు కూడా వివాదాస్పదంగా మారినట్లు సమాచారం.
కోట వినుత బహిష్కరణ, రాయుడు హత్య కేసు శ్రీకాళహస్తి రాజకీయాల్లో కీలక పరిణామంగా నిలిచింది. తమిళనాడు పోలీసులు ఈ కేసులో విచారణను ముమ్మరం చేస్తుండగా, జనసేన పార్టీ తన ఇమేజ్‌ను కాపాడుకునేందుకు వినుతను బహిష్కరించింది. ఈ పరిణామాలపై జిల్లాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.