Jagan: కీలక సమయాల్లో జగన్ మౌనం.. పార్టీ శ్రేణుల్లో పెరుగుతున్న అసంతృప్తి..

‘జగన్ (Jagan) అంటే జనమే, జనమే అంటే జగన్’ అని ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ (YSRCP) శ్రేణుల్లో గర్జించిన నినాదం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. కాలక్రమంలో పార్టీ శైలి, కార్యక్రమాల తీరు బాగా తగ్గిపోవడంతో, ఇప్పుడు అరుదుగా చేసే కార్యక్రమాల్లో కూడా జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) కనిపించడం మానేశారు. తాడేపల్లి (Tadepalli) కార్యాలయంలో నిశ్శబ్దంగా ఉండే ఆయనను, పార్టీ నేతలు రోడ్లపైకి రావాలని కోరుతున్నారు. ఫలితంగా పార్టీ ప్రోగ్రామ్‌లు మొక్కుబడి స్థాయిలో, ఫోటో సెషన్‌లతోనే ముగిసిపోతున్నాయి. నేతలు కొద్దిసేపు వచ్చి మీడియాకు మాట్లాడి, ఫొటోలకు పోజులు ఇచ్చి వెళ్లిపోతే కార్యక్రమం ముగిసినట్టే.
ఇటీవల ‘అన్నదాత పోరు’ (Anadatha Poru) పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక నిరసనకు పిలుపునిచ్చింది. ఈనెల 9వ తేదీ మంగళవారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలను ఎత్తిచూపుతూ ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించారు. యూరియా కొరత, రైతుల కష్టాలు ప్రధాన అంశాలుగా నిరసనకు రూపకల్పన చేశారు. అయితే ఈ కార్యక్రమానికి కూడా జగన్ హాజరుకారు అని ముందే చెప్పేశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) మాట్లాడుతూ, “ఇది మనందరం కలిసే ముందుకు తీసుకెళ్ళాల్సిన కార్యక్రమం. జగన్ గారు వేరే పనిలో పాల్గొంటారు. ఇది ముందుగానే నిర్ణయించుకున్నది కాబట్టి మనమే విజయవంతం చేయాలి” అని సూచించారు.
మంగళవారం రోజున ప్రతి ఆర్డీవో కార్యాలయం ముందు పార్టీ నాయకులు రైతులతో కలిసి ధర్నాలు చేసి, ప్లకార్డులు ప్రదర్శించనున్నారు. కానీ ఎక్కడా గొడవలు జరగకుండా శాంతియుతంగా కొనసాగించాలని సజ్జల ప్రత్యేకంగా సూచించారు. ఈ నిరసన పోస్టర్‌ను కూడా ఆయనే ఆవిష్కరించారు. సాధారణంగా రాష్ట్ర స్థాయి పెద్ద సమస్యలపై ముందుండాల్సిన జగన్ గారు ఈసారి కూడా కనిపించకపోవడం ఆశ్చర్యమనే చెప్పాలి.
ఇది మొదటిసారి కాదు. ఇంతకుముందు ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇతర పథకాలపై కూడా పార్టీ నిరసనలు చేపట్టింది. కానీ వాటిలోనూ జగన్ లేనందువల్ల పెద్దగా ఫలితం రాలేదు. చాలా జిల్లాల్లో కార్యకర్తలు “జగన్ లేకుండా మాకు రావడం సాధ్యం కాదు” అంటూ తేల్చేశారు. ఆ తర్వాత నాయకులు వారిని బతిమాలి, బలవంతంగా ఫోటోలకు తీసుకురావాల్సి వచ్చింది. ఫలితంగా ఆ కార్యక్రమాలు పేరుకే జరిగాయి, కానీ ప్రజల్లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో రైతుల సమస్యలపై బలమైన ఆందోళన అవసరం ఉన్న సమయంలో కూడా జగన్ “ముందు మీరు, తరువాత నేను” అన్నట్టుగా పక్కకు తప్పుకోవడం పార్టీ శ్రేణుల్లో అసహనానికి కారణమవుతోంది. ప్రజలే తన బలం అని చెప్పుకున్న నాయకుడు, ఇప్పుడు కీలక సమయాల్లో ఎందుకు మౌనంగా ఉంటున్నారని అనుచరులు ప్రశ్నించుకోవడం ప్రారంభించారు. పార్టీ ప్రోగ్రామ్‌లు వాస్తవ సమస్యల కంటే ఫోటోలకు పరిమితమవుతుండటంతో వైసీపీ భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.