Jagan: పోస్టులకే పరిమితమైన జగన్: ప్రజల మధ్యకెప్పుడు?

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) ఇటీవలి కాలంలో ప్రజల మధ్య కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. ఒకప్పుడు రోడ్లపైకి వచ్చి పోరాటం చేసిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ (Tadepalli Palace)కే పరిమితమైపోయారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజా సమస్యలపై నేరుగా స్పందించడం మానేసి, కేవలం సోషల్ మీడియా పోస్టుల ద్వారానే తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆయన పార్టీకి చెందిన నాయకులు జైలుకు వెళ్ళినప్పుడు మాత్రమే జగన్ బయటకు వచ్చి పరామర్శించడం మినహా, సాధారణ సమస్యలపై ఆయన ఒక ఉద్యమం కూడా చేపట్టలేదని విమర్శకులు అంటున్నారు. రైతుల సమస్య, మద్దతు ధరలు, గోదాముల లోటు, ఎరువుల సరఫరా, పంటల ఇబ్బందులు వంటి కీలక విషయాలపై కూడా ఆయన పోస్ట్‌లకే పరిమితమవుతున్నారు. ఆరోగ్యశ్రీ (Aarogyasri) పథకాన్ని ప్రైవేటు రంగానికి అప్పగించే అవకాశం ఉందని వార్తలు వచ్చిన నేపథ్యంలో కూడా జగన్ నాలుగు పేజీలకు పైగా ఒక స్టేట్‌మెంట్‌ను సోషల్ మీడియాలో ఉంచారు. పేదల కోసం తెచ్చిన పథకాన్ని ఇలా మార్చడం సరైందా అని ప్రశ్నించారు. కానీ ఈ వాదనలు ప్రజల మధ్యకు వెళ్లి చెప్పకపోతే ఏ మేర ప్రభావం చూపుతాయి అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.
ఇంటి లోపల కూర్చొని ఎన్ని పోస్టులు చేసినా, అవి ఎంతమందికి చేరతాయి అన్నది అనుమానమేనని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సోషల్ మీడియా ప్రభావం పరిమితంగానే ఉంటుంది. అలాంటి సమయంలో పోస్టులు కాకుండా ప్రజలతో నేరుగా కలవడం అవసరమని అనేక సీనియర్ నాయకులు భావిస్తున్నారు.
గత సంవత్సరం నుంచి జగన్ ప్రజా ర్యాలీలు లేదా సమావేశాలకు దూరంగా ఉన్నారు. ఈ ధోరణి కొనసాగితే పార్టీ పునరుద్ధరణ ఎలా జరుగుతుందన్న ఆందోళన వైసీపీ (YCP)లో కనిపిస్తోంది. ఆయన అభిమానించే కొన్ని వర్గాలు కూడా మౌనం పాటిస్తున్నాయి. జగన్ నాయకత్వంపై నమ్మకం ఉన్న వారు కూడా ఈ పరిస్థితుల్లో అయోమయానికి గురవుతున్నారు. జగన్ ప్రస్తుత విధానం ఆయన వ్యక్తిగత ప్రజాదరణకు ప్రతికూలంగా మారవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ప్రజల సమస్యలతో నేరుగా మమేకం కాకుండా కేవలం పోస్టులకే పరిమితమైతే, రాబోయే ఎన్నికల్లో ఆయన ప్రభావం తగ్గిపోవచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ముందు ముందు అయినా ఆయన ప్రజలతో నేరుగా కలవకపోతే పార్టీ గ్రాఫ్ ఎలా పెరుగుతుంది అన్న విషయం అనిశ్చితంగా ఉంది. ముఖ్యంగా 2029 ఎన్నికలకు సిద్ధమయ్యే సమయానికి వైసీపీ ఒంటరిగా బలపడాలంటే ఇప్పటినుంచే ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సీనియర్ నేతలు సూచిస్తున్నారు. కానీ ఇప్పటివరకు జగన్ దగ్గర కనిపిస్తున్న సమాధానం మాత్రం సోషల్ మీడియా పోస్టులే కావడం మరింత చర్చనీయాంశంగా మారింది.