Chandrababu: 2030 నాటికి ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా : సీఎం చంద్రబాబు
గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అమరావతి డిక్లరేషన్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) విడుదల చేశారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో చీఫ్ సెక్రటరీ విజయానంద్ (Vijayanand), నెడ్ క్యాప్ ఎండీ కమలాకర్ బాబు (Kamalakar Babu) సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. 2030 నాటికి ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ (Green Hydrogen Valley)గా మార్చేందుకు అవసరమైన కార్యాచరణ ప్రకటిస్తూ డిక్లరేషన్‌ను రూపొందించారు. ఇటీవల అమరావతి (Amaravati)లో గ్రీన్ హైడ్రోజన్‌పై రెండు రోజుల పాటు జరిగిన నమ్మిట్లో గ్రీన్ హైడ్రోజన్ కంపెనీల సీఈఓలు, సీఓఓలు, ఎండీలు, ఇండస్ట్రీ రంగ నిపుణులు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరిగిన సమ్మిట్‌లో చర్చించిన అంశాల అధారంగా రాష్ట్ర ప్రభుత్వం డిక్లరేషన్ ప్రకటించింది. రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అనుకూల పరిస్థితులు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి దేశంలోనే అతిపెద్ద ఎకో సిస్టంను రాష్ట్రంలో నెలకొల్పటమే ఈ డిక్లరేసన్ ఉద్దేశమన్నారు.







