Chandrababu: ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఐటీలో.. భారతీయులదే కీలకపాత్ర : చంద్రబాబు
విశాఖలో గూగుల్ (Google) భారీ పెట్టుబడులతో అడుగు పెట్టనుందని, రూ.50 వేల కోట్ల పెట్టుబడితో 1 గిగావాట్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) తెలిపారు. విశాఖలోని నోవాటెల్లో నిర్వహించిన ఇండియా-యూరప్ బిజినెస్ సమావేశంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ సాంకేతిక రంగంలో కొత్త ఆవిష్కరణలకు అందిపుచ్చుకుంటున్నట్లు తెలిపారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఐటీ (IT) లో భారతీయులదే కీలకపాత్ర అని పేర్కొన్నారు. ఇండియా- యూరప్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపారు. అమరావతి (Amaravati) లో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ అందుబాటులోకి రానుంది. పెట్టుబడులకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. మౌలిక సదుపాయాల కల్పనలో కూడా ఏపీ ముందుంది. గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు రానున్నాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో ముందుకెళ్తున్నాం. రాష్ట్రంలో పోర్టులతో పాటు రైల్వే అనుసంధానానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏపీలో నైపుణ్యం ఉన్న యువత అందుబాటులో ఉన్నారు. కొత్త ఆలోచనలతో వినూత్న ఆవిష్కరణలు చేయడంతో వారు ముందున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టండి. అనుమతుల్లో ఎలాంటి జాప్యం ఉండదు అని అన్నారు.







