Renew Energy: ఏపీకి ‘రీన్యూ’ భారీ బూస్ట్.. లోకేశ్ చెప్పిన పెట్టుబడి ఇదే!
ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) కూటమి ప్రభుత్వం పెట్టుబడుల ఆకర్షణపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే గూగుల్ (Google) లాంటి సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆ కోవలోనే రీన్యూ (ReNew) సంస్థ భారీ పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపించింది. రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. పునరుత్పాదక ఇంధన రంగంలో దేశంలోనే అగ్రగామి సంస్థ అయిన రీన్యూ (ReNew) ఆంధ్రప్రదేశ్‌లో రూ. 82,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించిందన్నారు. ఐదేళ్ల విరామం తర్వాత రాష్ట్రం నుంచి నిష్క్రమించిన ఒక ప్రముఖ సంస్థ తిరిగి రావడం గొప్ప విషయం అన్నారు. ఇది కేవలం పెట్టుబడి ప్రకటనగానే కాకుండా, రాష్ట్ర పారిశ్రామిక విధానాలపై పెట్టుబడిదారుల విశ్వాసం పునరుద్ధరణకు సంకేతంగా నిలుస్తోంది.
జాతీయ స్థాయిలో పునరుత్పాదక ఇంధన రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ‘రీన్యూ’ సంస్థ గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించాలనే లక్ష్యంతో వేగంగా అడుగులు వేయడంతో, ఈ సంస్థ తిరిగి రావడానికి మార్గం సుగమమైంది. మంత్రి నారా లోకేశ్ స్వయంగా ఈ శుభవార్తను తన ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. విశాఖలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరవుతున్న రీన్యూ ఛైర్మన్ సుమంత్ సిన్హా బృందానికి ఆయన సాదర స్వాగతం పలికారు.
ఈ 82వేల కోట్ల పెట్టుబడి కేవలం సంప్రదాయ సోలార్/విండ్ విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే పరిమితం కాకపోవడం ఈ ఒప్పందంలో అత్యంత కీలకమైన అంశం. రీన్యూ సంస్థ చేయబోయే పెట్టుబడి స్వరూపాన్ని మంత్రి లోకేశ్ వివరిస్తూ… ఇది పునరుత్పాదక ఇంధన రంగంలో ఎండ్ టు ఎండ్ పెట్టుబడి అని వెల్లడించారు. ఈ పెట్టుబడిలో సోలార్ ఇంగాట్, వేఫర్ తయారీ (Solar Ingot, Wafer Manufacturing) వంటి హైటెక్ విభాగాలతో పాటు, 6MW సామర్థ్యం గల సోలార్ సెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. ఇది రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుంది. గ్రీన్ హైడ్రోజన్ (Green Hydrogen) ఉత్పత్తి, ఇతర సెల్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడం ద్వారా ఏపీని భవిష్యత్తు ఇంధన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఈ పెట్టుబడి దోహదపడుతుంది. గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూచర్ ఇంధనం కావడంతో, ఇది ఇతర పరిశ్రమలను కూడా రాష్ట్రానికి ఆకర్షించే అవకాశం ఉంది. సోలార్/విండ్ సైట్స్‌లో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS), హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నారు. ఇవి రాత్రి పూట పీక్ పవర్ అవసరాలను తీర్చడానికి ఉపయోగపడతాయి.
సాధారణ సోలార్, విండ్ ప్రాజెక్టులను కంపెనీలకు ఇచ్చే అవకాశాలుగా మాత్రమే పరిగణిస్తారు. కానీ రీన్యూ సంస్థ పెట్టుబడిలో ఉన్న ఈ తయారీ (Manufacturing), నిల్వ (Storage) విభాగాల వల్ల రాష్ట్రానికి దీర్ఘకాలికంగా పన్నుల రాబడితో పాటు, వేలాది మందికి ఉద్యోగాల కల్పన జరుగుతుందని లోకేశ్ పేర్కొన్నారు. గూగుల్ వంటి పెట్టుబడి కంటే 10 రెట్లు మెరుగైనదిగా పారిశ్రామిక విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తీసుకుంటున్న చర్యలు భారీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. కొత్త పారిశ్రామిక విధానాలపై పెట్టుబడిదారులలో ఇవి నమ్మకాన్ని పెంచుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ‘రీన్యూ’ తిరిగి రావడం రాష్ట్రం పారిశ్రామిక రంగంలో ఒక కొత్త శకానికి నాంది పలకనుంది. పునరుత్పాదక ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే కీలక కేంద్రంగా మారుస్తూ, వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించే శక్తి ఈ పెట్టుబడికి ఉంది. ఈ కీలక పరిణామం రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రంలో ఒక బలమైన సానుకూల మార్పును తీసుకురాగలదని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.







