గ్రీన్ ఎనర్జీ సిటీగా అమరావతి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరాన్ని గ్రీన్ సిటీగా నిర్మించేందుకు సీఆర్డీఏ పరిధిలో అంతర్జాతీయ స్థాయి అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ (టెరీ)సంస్థ ముందకొచ్చింది. అంతేకాదు, అమరావతి నగరాన్ని గ్రీన్ ఎనర్జీ సిటీగా రూపుదిద్దే విషయంలో సీఆర్డీఏతో కలిసి పనిచేయడానికి సంసిద్దత వ్యక్తం చేసింది. సీఎం చంద్రబాబు దూరదృష్టితో చేస్తున్న కార్యక్రమాలకు సంపూర్ణ సహకారం అందిస్తామని టెరీ డైరెక్టర్ జనరల్ అజయ్ మాధుర్ తెలిపారు. ఢిల్లీలోని టెరీ ప్రధాన కార్యాలయంలో టెరీ డైరక్టర్ జనరల్ అజయ్ మాధుర్‌తో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ సీఈఓ ఏ.చంద్రశేఖర్ రెడ్డి, సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ సమావేశమయ్యారు. ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఈ బేటీలో పాల్గొన్నారు. సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, ఇంధన సీర్డీఏ సలహాదారు ఏ.చంద్రశేఖరరెడ్డి మాథుర్‌ను స్వయంగా కలిశారు. సీఆర్డీఏ పరిధిలో రూ.1.37 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయని, మే 15వ తేదీ నాటికి అమరావతి తుది మాస్టర్ ప్లాన్ సిద్ధమవుతుందని శ్రీధర్ తెలిపారు. దీంతో, తాము టెరీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, మే 3వ వారంలో ముఖ్యమంత్రితో భేటీ అవుతామని అజయ్ తెలిపారు.













