హరిత నగరంగా అమరావతి
రాజధాని అమరావతి ప్రాంతంలోని వాతావరణ పరిస్థితులు, వాస్తు, ఆంధ్రప్రదేశ్, చరిత్ర, సంస్కృతి, ఆధునిక నగరానికి ఉండాల్సిన లక్షణాలను దృష్టిలో ఉంచుకుని రాజధానిలో 900 ఎకరాల్లో నిర్మించే ప్రభుత్వ భవనాల సముదాయ స్థూల ప్రాథమిక ప్రణాళిక సిద్ధమైంది. దీనిని లండ్కు చెందిన నార్మన్ ఫోస్టర్ అండ్ పార్టనర్స్ సంస్థ ప్రభుత్వానికి అందజేసింది. ఆ సంస్థ ఇదివరకు నాలుగు నమూనాలు రూపొందించి ఈ నెల 1న ప్రభుత్వానికి అందజేసింది. దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ఉన్నతాధికారులు కొన్ని సూచనలు చేశారు. వాటన్నింటినీ పొందుపరిచి నార్మన్ ఫోస్టర్ ఓ స్థూలా వ్యూహ ప్రణాళికను రూపొందించింది. దీనిలోనూ అవసరమైన మార్పులు చేసే అవకాశం ఉంది. విలక్షణ భవనాలుగా రూపొందించనున్న హైకోర్టు, శాసనసభలకు సంబంధించి ఒక్కో భవనానికి మూడు చొప్పున ప్రాథమిక ఆకృతుల్ని ఆ సంస్థ అందజేసింది. రాష్ట్ర మంత్రివర్గం వీటిని పరిశీలించింది. ఈ ఆకృతుల్లోని విశేషాలను నార్మన్ ఫోస్టర్ సంస్థ ప్రతినిధులు వారికి వివరిస్తారు. వారి సూచనలు స్వీకరిస్తారు.
ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాజధాని సలహా మండలి సభ్యులతోనూ ఒక సమావేశం నిర్వహించి, ఈ ఆకృతులపై సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. మరోపక్క సీఆర్డీఏ అధికారులు, నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమావేశమవుతారు. హైకోర్టులో ఎలాంటి వసతులుండాలన్న విషయంలో ఆయన సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. ప్రాథమిక ఆకృతుల్ని సీఆర్డీఓ వెబ్సైట్లో ఉంచుతారు. ప్రజల సలహాలు కూడా స్వీకరించాలని ముఖ్యమంత్రి అధికారులకు సృష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వివిధ వర్గాల నుంచి వచ్చిన సలహాలు స్వీకరించిన మీదట నార్మన్ ఫోస్టర్ తుది ఆకృతుల్ని సిద్ధం చేస్తుంది.






