Vizag: విశాఖలో సిఐఐ భాగస్వామ్య సదస్సు అద్భుతవిజయం
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతిలో విశాఖ సాగర తీరంలో జరిగిన సిఐఐ సమ్మిట్ (CII Partnership Summit) సరికొత్త చరిత్రను లిఖించింది. రాష్ట్ర ప్రభుత్వం, సీఐఐ సంయుక్తంగా నిర్వహించిన 30వ భాగస్వామ్య సదస్సు అంచనాలకు మించి అద్భుత విజయాన్ని సాధించింది. రాష్ట్రానికి పెట్టుబడుల సునామీని తీసుకొచ్చింది. ఈ సదస్సులో ఏకంగా రూ.13,25,716 కోట్ల విలువైన పెట్టుబడులపై ఒప్పందాలు (ఎంఓయూలు) కుదిరాయి. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో 16,31,188 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. వాస్తవానికి ఈ సదస్సును రెండు రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం మొదట భావించింది. సుమారు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేసింది. అయితే, పారిశ్రామికవేత్తల నుంచి అనూహ్య స్పందన రావడంతో సదస్సుకు ముందే ఒప్పందాలను కుదుర్చుకోవాల్సి వచ్చింది. పెట్టుబడులు పెట్టేందుకు దేశ, విదేశీ సంస్థలు భారీగా తరలిరావడంతో అంచనాలను మించి ఏకంగా 30 శాతం అధికంగా, అంటే రూ.13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి రావడం ప్రభుత్వ వర్గాల్లోనూ కొత్త ఉత్సాహాన్ని నింపింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చిననాటి నుంచే రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. క్రమం తప్పకుండా రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశాలు నిర్వహిస్తూ పరిశ్రమలకు శరవేగంగా అనుమతులు మంజూరు చేశారు. దీనికి కొనసాగింపుగా, రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి స్వయంగా సింగపూర్, యూఏఈ, లండన్ వంటి దేశాల్లో పర్యటించి పారిశ్రామికవేత్తలను సదస్సుకు ఆహ్వానించారు. ఈ కృషి ఫలించి భాగస్వామ్య సదస్సు రికార్డు స్థాయి విజయాన్ని నమోదు చేసింది.
మూడు రోజుల పాటు జరిగిన ఈ పెట్టుబడుల మేళాలో సింహభాగం ఒప్పందాలు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే జరగడం విశేషం. మొత్తం 123 ఎంఓయూల ద్వారా రూ.7,63,210 కోట్ల పెట్టుబడులు సీఎం సమక్షంలోనే ఖరారయ్యాయి. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సహా ఇతర మంత్రులు కూడా తమ వంతు కృషి చేసి 490 ఎంఓయూల ద్వారా రూ.5,62,506 కోట్ల పెట్టుబడులను సాధించారు. సదస్సులో తొలి రోజు రూ.3.65 లక్షల కోట్లు, రెండో రోజు రూ.3.49 లక్షల కోట్లు, చివరి రోజు రూ.48,430 కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరాయి. ఈ సదస్సు ద్వారా మొత్తం 12 కీలక రంగాల్లోకి పెట్టుబడుల ప్రవాహం రానుంది. ఇందులో ఇంధన, పరిశ్రమలు, మౌలిక వసతుల రంగాలు అత్యధిక పెట్టుబడులను ఆకర్షించాయి. పెట్టుబడుల్లో టాప్-3లో ఇంధన రంగం, పరిశ్రమలు, మౌళిక వసతుల రంగాలు నిలిచాయి. మొత్తంగా రూ. 13.25 లక్షల కోట్ల మేర పెట్టుబడుల్లో అధిక భాగం ఇంధన రంగానికి వచ్చాయి. ఈ రంగంలో రూ. 5,33,351 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఆ తర్వాత పరిశ్రమల రంగానికి రూ. 2,80,384 కోట్లు, మౌళిక వసతుల రంగానికి రూ. 2,01,758 కోట్లు వచ్చాయి. ఇక ఉద్యోగాల కల్పనకు సంబంధించి టాప్-3లో పరిశ్రమలు, మౌళిక వసతులు. ఐటీఈ అండ్ సీ రంగాలున్నాయి.
ఆచరణలోకి తీసుకువస్తాం: చంద్రబాబు
భాగస్వామ్య సదస్సులో చేసుకున్న రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలను మూడున్నరేళ్లలో ఆచరణలోకి తీసుకువస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈసారి అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాం. పెట్టుబడిదారులతో ముందే అన్నీ మాట్లాడాం. నిబద్ధత ఉన్నవారితోనే ఒప్పందాలపై సంతకాలు చేశాం. వారిలో ఎవరికైనా అనుకోని ఆర్థిక ఇబ్బందులు వస్తే తప్ప.. మొత్తం ప్రతిపాదనలన్నీ ఆచరణలోకి వస్తాయి అని ఆయన పేర్కొన్నారు. పెట్టుబడిదారుల సదస్సు ముగిశాక ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఐదేళ్లలో 50లక్షల ఉద్యోగాలు, పదేళ్లలో కోటి ఉద్యోగాలు కల్పించాలన్నది తమ లక్ష్యమని తెలిపారు. 20 లక్షల ఉద్యోగాల లక్ష్యాన్ని 50 లక్షలకు పెంచుతున్నానని తెలిపారు. విశాఖలో రెండురోజుల పాటు నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సు సూపర్‌హిట్ అయిందని హర్షం వ్యక్తం చేశారు. వచ్చే సంవత్సరం ఇదే నెలలో, ఇవే తేదీల్లో విశాఖలోనే భాగస్వామ్య సదస్సు జరుగుతుందన్నారు.
‘ఇంతవరకు 30 సార్లు భాగస్వామ్య సదస్సులు నిర్వహిస్తే ఏడుసార్లు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టాం. సాధారణంగా ఇలాంటి సదస్సుల్లో ఎంఓయూలకే ప్రాధాన్యమిస్తారు. కానీ కొత్త ఆవిష్కరణలు, విజ్ఞానం, వివిధ రంగాల్లో వస్తున్న విప్లవాత్మక మార్పులపై చర్చ జరగాలి. దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఎంఓయూలు ఉండవు. ఒకపక్క పెట్టుబడిదారులతో ఎంఓయూలు చేస్తూనే, మరోపక్క చర్చలకు ప్రాధాన్యమిచ్చాం’’ అని వివరించారు. రాష్ట్రంలో పెద్దసంఖ్యలో హరిత ఇంధన ప్రాజెక్టులు ఏర్పాటవుతున్నాయి కాబట్టే డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ ముందుకొచ్చింది. ఇప్పుడు డేటా సెంటర్లు పెడతామని మరో ఐదారుగురు ఆసక్తి చూపుతున్నారు. ఈ సదస్సు పెట్టుబడులను ఆకర్షించడానికే పరిమితం కాలేదని, నాలెడ్జ్ షేరింగ్ సెషన్లు, ప్రపంచ పారిశ్రామిక రంగంపై చర్చలతో హైబ్రిడ్ నమూనాలో నిర్వహించమన్నారు. అదనంగా 450 మంది విద్యార్థులను ఈ సదస్సులో పాల్గొనడానికి ఎంపిక చేసి, వారిని భావి ఎంటర్ ప్రెన్యూర్లగా ఎదిగేందుకు అవకాశం కల్పించామన్నారు. ఎంటర్ప్రెన్యూర్లగా ఎదగాలనే ఆశయంతో ఉన్న యువతకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ వేదికగా పనిచేస్తోందన్నారు. భావి ఎంటర్ ప్రెన్యూర్లను ప్రోత్సహించడానికి 175 నియోజకవర్గాల్లోనూ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అదనంగా పారిశ్రామికీకరణను ప్రోత్సహించడానికి ఉమ్మడి మౌలిక సదుపాయాలు, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తామన్నారు. శ్రీసిటీని గురించి చెబుతూ అక్కడ 31 దేశాల భాగస్వామ్యంతో 240 యూనిట్లు ఉన్నాయని, దేశాల భాగస్వామ్యం యాభైకి పెంచాలని భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. మంత్రులు, అధికారుల చొరవతో అన్ని విభాగాలు పెట్టుబడులను ఆకర్షించాయన్నారు. 17 నెలల్లో ప్రభుత్వం పెట్టుబడిదారులలో విశ్వాసాన్ని కలిగించగలిగింద న్నారు. రాష్ట్ర ప్రభుత్వ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో భారీ పెట్టుబడులను ఆకర్షించిందన్నారు. 24 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించేలా పెట్టుబడులను రాష్ట్రం ఆకర్షించగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
నమ్మకాన్ని కలిగించేందుకే ఎస్క్రో ఖాతా
ఏ ప్రభుత్వం వచ్చినా పెట్టుబడిదారులకు ఇబ్బంది ఉండదన్న నమ్మకాన్ని కలిగించేందుకే ఎస్క్రో ఖాతా ఏర్పాటు చేస్తున్నాం. పరిశ్రమల నిర్మాణం మొదలయ్యాక వారినుంచి ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో వచ్చే మొత్తంలో 60-80 శాతం ఎస్క్రో ఖాతాల్లో జమచేస్తాం. సహకార సమాఖ్య వ్యవస్థలో పోటీ అనివార్యం. రాష్ట్రాలు పోటీపడితేనే ప్రజలు లబ్ధి పొందుతారని చంద్రబాబు నాయుడు చెప్పారు.
పెట్టుబడులకు సంబంధించి అన్ని ప్రాంతాలకూ సమాన ప్రాధాన్యం ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఓర్వకల్లులో రిలయన్స్ బెవరేజెస్ పరిశ్రమ ను ఫిబ్రవరిలో ప్రారంభిస్తున్నారు. అనంతపురం జిల్లాలో హార్టికల్చర్ మెగా ఫుడ్‌పార్క్. ఏర్పాటు చేస్తున్నాం. రాయలసీమలో డ్రోన్, ఎలక్ట్రానిక్ సిటీ వస్తున్నాయి. విశాఖలో సముద్రం ఉండటంతో డేటా సెంటర్లు వస్తున్నాయి. మూడు ప్రాంతాల్లో మూడు ఎకనమిక్ రీజియన్లు అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.
శ్రీసిటీని విస్తరిస్తాం: చంద్రబాబు
అనేక పరిశ్రమలతో నెలకొని ఉన్న శ్రీసిటీని మరింతగా విస్తరించనున్నట్లు ఇందుకోసం 6వేల ఎకరాల భూమిని కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అలాగే శ్రీ సిటి సమీపంలో ఎయిర్‌స్ట్రిప్ నిర్మాణం జరుగుతుం దన్నారు. పరిశ్రమల విస్తరణ కోసం ఈ 6 వేల ఎకరాల భూమి కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఉత్తమ మౌలిక వసతులతో 1.5 లక్షల ఉద్యోగాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నామని.. 2028 నాటికి శ్రీసిటీని ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతాం అని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ విస్తరణ వల్ల మరో 50 కంపెనీల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నారు. ఈ విస్తరణ రాష్ట్ర ఆర్థిక వృద్ధికి బలమైన ఊతమిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బెల్జియం, జపాన్, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి హెల్త్‌కేర్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ఇంజినీరింగ్ రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీలు శ్రీసిటీలో స్థాపనకు అనుమతులు పొందాయి. ఈ అంతర్జాతీయ భాగస్వామ్యం ద్వారా సాంకేతిక ఆవిష్కరణలు, నాణ్యమైన ఉత్పత్తులు స్థానికంగా అందుబాటులోకి రానున్నాయి. ఈ కంపెనీలు స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ అవకాశాలను కూడా కల్పించనున్నాయి. దీంతో శ్రీసిటీ ఒక గ్లోబల్ హబ్‌గా రూపొందనుంది.
టెలికం రంగంలో పెట్టుబడులు పెట్టండి: పెమ్మసాని చంద్రశేఖర్
పెట్టుబడులు పెట్టేందుకు వచ్చేవారికి ఏపీ ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. విశాఖ పెట్టుబడిదారుల సదస్సులో ఆయన మాట్లాడుతూ… టెలికాం రంగంలో 25 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు అవకాశాలున్నాయన్నారు. కొత్త కంపెనీలు, పరిశ్రమలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొస్తే అవసరమైన అనుమతులను వేగంగా మంజూరు చేయడానికి కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. దేశంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న పెట్టుబడి గమ్యస్థానాల్లో ఏపీ ఒకటన్నారు. విశాఖపట్నం ఇండస్ట్రీ అండ్ ఫిన్‌టెక్, అనంతపురం ఆటోమొబైల్స్, తిరుపతి ఎలక్ట్రానిక్స్ రంగాలకు కేంద్రాలుగా మారనున్నాయన్నారు. తిరుపతి ఎలక్ట్రానిక్స్ రంగాలకు కేంద్రాలుగా మారనున్నాయన్నారు.
ముక్కోణపు అభివృద్ధి: రామ్మోహన్నాయుడు
ఆంధ్రప్రదేశ్‌లో ముక్కోణపు అభివృద్ధి జరుగుతోందని, అమరావతి, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం జరుగుతోందని కేంద్ర మంత్రి కె.రామ్మోహన్నాయుడు అన్నారు. విశాఖలో పెట్టుబడిదారుల సదస్సులో ఆయన మాట్లాడుతూ… ఏపీలో పెట్టుబడి పెట్టడమంటే ఒక రాష్ట్రంలో పెట్టడం కాదని, మైండ్‌సెట్‌పై పెట్టడం వంటిదని అభివర్ణించారు. ఇక్కడ జరిగే ప్రతి అవగాహన ఒప్పందం ఒక విజయ గాథగా మారుతుందన్నారు. ‘సమయమే చివరికి అసలైన ధనం’గా నిలుస్తుంద న్నారు. ఏపీ ప్రజలు కష్టపడి పనిచేసేతత్వం కలిగిన వారని, అందుకే వారికి విజయాలు సొంతం అవుతాయని అన్నారు.
కేంద్ర ఉక్కు సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ… రాష్ట్రానికి పలు ప్రాజెక్టులు మంజూరుచేస్తున్న కేంద్రం, వాటి అమలుకు అన్ని విధాలా సాయపడుతుందన్నారు. చంద్రబాబు బ్రాండ్‌తో ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. ఏపీలో పరిశ్రమల కోసం 550 పారిశ్రామిక పార్కులు సిద్ధంగా ఉన్నాయన్నారు.
రూ.2,500 కోట్లతో విశాఖలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమ
రాష్ట్రంలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నామని ఆసిప్ టెక్నాలజీ ఎండీ వెంకట సింహాద్రి తెలిపారు. రూ.2,500 కోట్లతో పెట్టుబడి పెట్టనున్నామని, మొదటి ఫేజ్‌లో రూ.2,000 కోట్లు పెట్టి 1,500 మందికి ఉద్యోగాలు కల్పిస్తాం. రెండో దశలో మిగిలిన రూ.500 కోట్లను పెట్టుబడి పెడతాం. దక్షిణ భారతదేశంలో ఈ తరహా పరిశ్రమ ఏర్పాటుకావడం ఇదే తొలిసారి. దీన్ని విశాఖలో ఏర్పాటు చేయబోతున్నాం. కేంద్ర ప్రభుత్వం, మైటీ రూపొందించిన ఇండియా సెమీ కండక్టర్ మిషన్‌లో భాగంగా పది ప్రాజెక్టులకు రూ.76 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ పది ప్రాజెక్టుల్లో మాది ఒకటి. దీనిని సీఎం చంద్రబాబు చొరవతో విశాఖలో ఏర్పాటు చేసేందుకు కేంద్రం అంగీకరించింది. ఇప్పటివరకూ సెమీ కండక్లర్ల కోసం తైవాన్, కొరియా, జపాన్ దేశాలపై ఆధారపడుతూ వస్తున్నాం. ఇకపై మనమే తయారు చేసుకోబోతున్నామని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో బ్రూక్‌ఫీల్డ్ భారీ పెట్టుబడులు
ఆంధ్రప్రదేశ్‌లో సుమారు రూ. లక్ష కోట్ల భారీ పెట్టుబడి పెట్టడానికి బ్రూక్‌ఫీల్డ్ సంస్థతో ఒప్పందం జరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘‘మన రాష్ట్రంలో 12 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడుల కోసం బ్రూక్‌ఫీల్డ్‌తో అవగాహన ఒప్పందం జరిగింది. ఇందులో క్లీన్ ఎనర్జీ ఇంధనాన్ని వినియోగించే 3 గిగావాట్ల డేటా సెంటర్‌తో పాటు అదనంగా రాష్ట్ర వ్యాప్తంగా క్లీన్ ఎనర్జీ ప్లాంటులు ఉంటాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా వారికి అవసరమైనవి సమకూర్చుతాం’’ అంటూ సీఎం పేర్కొన్నారు.






