ఏపీలో ఫ్లిప్‌కార్డ్ పెట్టుబడులు
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్డ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూరి, కంపెనీ అత్యున్నతాధికారుల బృందం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో భేటీ అయ్యింది. రాష్ట్రంలో పెట్టుబడులు, వ్యాపార అవకాశాలు, రైతులకు మంచి ధరలు అందేలా చూడటం, నైపుణ్యాభివృద్ధి అంశాలపై ఇరువురి మధ్య విసృత్తంగా చర్చలు జరిగాయి. రాష్ట్ర వ్యవసాయ రంగంలో విప్లవాత్మక చర్యగా ఆర్బీకేలను ప్రారంభించామని, రైతులకు విత్తనం అందించడం దగ్గరనుంచి వారి పంటల కొనుగోలు వరకూ ఆర్బీకేలు నిరంతరం వెన్నుదన్నుగా నిలుస్తాయని ముఖ్యమంత్రి ఫ్లిప్‌కార్ట్ సీఈవోకు వివరించారు. రైతులకు పంటలకు మంచి ధరలు వచ్చేలా ఫ్లిప్ కార్ట్ దోహదపడాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. వారి ఉత్పత్తులను కొనుగోలు చేసి వినియోగదారులకు అందించే కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. మంచి టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడంలో సహాయపడాలన్నారు. ఎప్పటికప్పుడు ధరల పర్యవేక్షణకు యాప్ ఉందని, దాన్ని మరింత మెరగుపరిచేందుకు తగిన తోడ్పాటు అందించాలని కూడా ముఖ్యమంత్రి కోరారు.
తాము విస్తృతపరుస్తున్న సరుకుల వ్యాపారంలో రైతుల నుంచి ఉత్పత్తులు కొనేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఫ్లిప్‌కార్ట్ సీఈఓ ముఖ్యమంత్రికి తెలిపారు. ఇది ఉభయులకు ప్రయోజనమన్నారు. మంచి టెక్నాలజీని అందించేలా తమ వంతు కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలో విశాఖపట్నం ఐటీ, ఈకామర్స్ పెట్టుబడులకు మంచి వేదిక అని, అక్కడ మరిన్ని పెట్టుబడులకు ముందుకు రావాలని సీఎం ఫ్లిప్‌కార్ట్ పిలుపునిచ్చారు. నైపుణ్యాలను మెరుగుపరచడానికి విశాఖలో హై ఎండ్ స్కిల్‌యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో భాగస్వాములు కావాలన్నారు. ముఖ్యమంత్రి ప్రతిపాదనలపై ఫ్లిప్‌కార్ట్ సీఈవో సానుకూలత వ్యక్తం చేశారు. విశాఖలో ఇప్పటికే తమ సంస్థ వ్యాపారాలు చురుగ్గా సాగుతున్నాయని మరిన్ని పెట్టుబడులు పెడతామన్నారు.






