Sugali Preethi: సుగాలి ప్రీతి కేసు.. నోరు విప్పిన పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్‌లో 2017లో సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి హత్యాచార కేసు (Sugali Preethi Case) ఇప్పటికీ కలకలం రేపుతోంది. కర్నూలు (Kurnool) జిల్లాలోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ హైస్కూల్లో 14 ఏళ్ల గిరిజన బాలిక సుగాలి ప్రీతి 2017 ఆగస్టు 18న అనుమానాస్పదంగా మరణించింది. స్కూల్ యాజమాన్యం ఆత్మహత్య అని చెప్పింది. తల్లిదండ్రులు అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపించారు. అయితే నిందితులు కేవలం 23 రోజుల్లో బెయిల్ పై బయటపడ్డారు.
అప్పటి తెలుగుదేశం పార్టీ (TDP) ప్రభుత్వం కేసును సీరియస్‌గా తీసుకోలేదనే ఆరోపణలున్నాయి. అనంతరం 2019లో వైసీపీ (YCP) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని సీబీఐకి అప్పగించింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కుటుంబానికి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అండగా నిలిచారు. కర్నూలుకు భారీ ర్యాలీగా వెళ్లి ప్రీతి కుటుంబాన్ని పరామర్శించారు. దీంతో అప్పటి జగన్ ప్రభుత్వం సుగాలి ప్రీతి తండ్రి రాజు నాయక్‌కు రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చింది. కుటుంబానికి 5 సెంట్ల ఇంటి స్థలం, వ్యవసాయ భూమి కేటాయించింది. అయితే కేసు ముందుకు సాగకపోవడంతో పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి సంతకం సుగాలి ప్రీతి కేసుపైనే చేస్తానన్నారు.
2024 ఎన్నికల్లో జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అధికారులతో చర్చించి కేసును సీఐడీకి (CID) అప్పగించేలా చర్యలు తీసుకున్నట్లు ప్రకటించారు. హోంమంత్రి వంగలపూడి అనిత కూడా కేసును రీ-ఓపెన్ చేసి సీఐడీ చీఫ్‌తో విచారణ చేయిస్తామని హామీ ఇచ్చారు. అయితే, 14 నెలలు గడిచినా కేసు ముందుకు సాగకపోవడంతో సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె చక్రాల కుర్సీలో జనసేన కార్యాలయానికి వెళ్లి పవన్‌కు వినతిపత్రం ఇచ్చారు. “ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా పోరాటానికి అండగా నిలిచారు. ఇప్పుడు అధికారంలో ఉండి మౌనంగా ఉండటం ఏమిటి?” అని ప్రశ్నించారు.
తాజాగా విజయవాడలో మీడియాతో మాట్లాడిన పార్వతి (Sugali Parvathi), పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. “న్యాయం చేస్తామని హామీ ఇచ్చి గాలికొదిలేశారు. మొదటి సంతకం సుగాలి ప్రీతి ఫైల్ మీదే అన్నారు. 14 నెలలైనా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. జనసేన ఆఫీసు ముందు ఆమరణ దీక్ష చేస్తాను” అని ప్రకటించారు. హోంమంత్రి అనితపై కూడా ఆరోపణలు చేశారు. “ఒక డ్రైవర్ హత్య కేసులో ప్రత్యేక బృందం ఏర్పాటు చేస్తున్నారు, కానీ మా కూతురు కేసులో శ్రద్ధ ఎందుకు లేదు? శ్రీకాంత్ పెరోల్‌పై ఉన్న శ్రద్ధ మా విషయంలో ఎందుకు లేదు?” అని ప్రశ్నించారు. గిరిజనులు ఓట్ల కోసమే పనికొస్తారా అని ఆమె నిలదీశారు.
ఈ విమర్శలపై పవన్ కల్యాణ్ తాజాగా విశాఖపట్నంలో జనసేన విస్తృత స్థాయి సమావేశంలో స్పందించారు. “అధికారంలోకి వచ్చిన వెంటనే సుగాలి ప్రీతి కేసుపై అధికారులతో చర్చించాను. గత వైసీపీ ప్రభుత్వంలో సాక్ష్యాలు తారుమారు చేసి, డీఎన్ఏ రిపోర్టులు మార్చేశారు. తప్పుడు జీవో జారీ చేసి కేసును సీబీఐకి అప్పగించి చేతులు దులుపుకున్నారు. సీబీఐ 2025 ఫిబ్రవరిలో తగినన్ని వనరులు లేవు అని హైకోర్టుకు తెలిపింది. మా పోరాటం వల్లే కుటుంబానికి భూమి, ఉద్యోగాలు లభించాయి. అయినా తమపై విమర్శలు చేస్తున్నారంటే అది వాళ్ల విజ్ఞత. పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు” అని పవన్ వ్యాఖ్యానించారు. సుగాలి పార్వతి వెనుక కొంతమంది నేతలు ఉన్నారని జనసేన అనుమానిస్తోంది.
సుగాలి పార్వతి డిజిటల్ క్యాంపెయిన్ చేస్తానని చెప్తున్నారు. సీబీఐ విచారణకు పట్టుబడుతున్నారు. నాడు అడుగడుగునా పవన్ కల్యాణ్ అండగా నిలిచారు. ఇప్పుడు అధికారంలో ఉండీ ఏమీ చేయట్లేదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆయనకు ఇప్పుడు ఇది పెద్ద సవాల్ గా మారింది.







