Bihar Elections: రేపే బీహార్ అసెంబ్లీ ఫైనల్ పోలింగ్!
బీహార్‌లో (Bihar) రాజకీయాలు కీలక దశకు చేరుకున్నాయి. 243 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో జరుగుతున్న ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. మొదటి దశ పోలింగ్ నవంబర్ 6న జరిగింది. రేపు చివరి దశ పోలింగ్ (Polling) జరగనుంది. ఈ దశలో 122 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఓటింగ్ జరగనుంది. తదుపరి ప్రభుత్వాన్ని నిర్ణయించే అత్యంత కీలక ఘట్టం ఇదే. ఈ ఎన్నికల ఫలితాలు 14న వెలువడనున్నాయి.
పోలింగ్‌కు ముందు బీహార్‌లో ప్రధాన పార్టీలు తీవ్రస్థాయిలో ప్రచారం నిర్వహించాయి. అధికార ఎన్డీఏ (NDA) కూటమి, ప్రతిపక్ష మహాకూటమి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఎన్డీఏ కూటమి తరపున ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వంటి అగ్ర నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలోని తమ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, మహిళా సాధికారత, రహదారుల నిర్మాణం, విద్య, వైద్యం వంటి అంశాలను ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రతిపక్ష ఆర్జేడీ (RJD) పాలనను జంగిల్ రాజ్ గా అభివర్ణిస్తూ, మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలని ఓటర్లను కోరారు. ఇక మహాకూటమికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ నాయకత్వం వహిస్తున్నారు. కాంగ్రెస్ (Congress) నాయకుడు రాహుల్ గాంధీ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కూటమి ప్రధానంగా యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగం, పేదరికం, ధరల పెరుగుదల వంటి అంశాలపై దృష్టి సారించింది. ప్రభుత్వ ఉద్యోగాల హామీ, సామాజిక న్యాయం వంటి నినాదాలు యువ ఓటర్లను ఆకర్షించాయని భావిస్తున్నారు.
నవంబర్ 6న తొలి విడతలో 121 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. తొలి దశలో ఓటర్లు పెద్దఎత్తున తరలివచ్చి ఓటేశారు. అయితే ప్రతిపక్షం మాత్రం పోలింగ్ శాతం తక్కువగా నమోదైందని, ఓటర్ల గణాంకాలను ఈసీ దాచిపెడుతోందని ఆరోపించింది. ఇక తుది దశ పోలింగ్ రేపు 122 స్థానాల్లో జరగనుంది. ఈ దశలో ఉత్తర, సెంట్రల్ బీహార్‌లోని కొన్ని ముఖ్యమైన ప్రాంతాలతో పాటు సరిహద్దు నియోజకవర్గాలు ఉన్నాయి. అగ్రనేతలందరూ తమ పార్టీల అభ్యర్థులకు మద్దతుగా ఇక్కడ తీవ్రంగా ప్రచారం నిర్వహించారు. ఈ దశలో జరిగే పోలింగ్ శాతం, ఏ కూటమికి మద్దతుగా ఓటర్లు నిలబడతారనేది రాష్ట్ర భవితవ్యాన్ని తేల్చనుంది.
బీహార్‌లో నిరుద్యోగం ప్రధాన సమస్యగా ఉంది. ఈ అంశంపై మహాకూటమి చేసిన వాగ్దానాలు ఎంతవరకు ప్రభావితం చేస్తాయనేది కీలకం. బీహార్ రాజకీయాల్లో కులం విడదీయలేని భాగం. ముఖ్యంగా యాదవులు, ముస్లింలు మహాకూటమికి అండగా ఉండగా, అత్యంత వెనుకబడిన తరగతులు (EBC), కొన్ని అగ్రకులాల మద్దతు ఎన్డీఏకు బలంగా ఉంది. నితీష్ కుమార్ సుదీర్ఘ పాలనపై కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. దీన్ని మహాకూటమి ఎంతవరకు ఓట్లుగా మార్చుకోగలుగుతుందనేది చూడాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రచారం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎన్డీఏకు ఏ మేరకు అనుకూలమవుతాయనేది అంతు చిక్కట్లేదు.
రేపు పోలింగ్ ముగియగానే, రాష్ట్రంలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే అంచనాలు, ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు తర్వాత పూర్తి స్పష్టత రానుంది. ఈ ఎన్నికలు బీహార్‌లో ఒక కొత్త రాజకీయ యుగానికి నాంది పలుకుతాయా, లేక ప్రస్తుత కూటమి తమ అధికారాన్ని నిలబెట్టుకుంటుందా అనేది ఆసక్తిగా మారింది.







