Rocket Force: మనకూ రాకెట్ ఫోర్స్ కావాలి – ఇండియన్ ఆర్మీ..!
ప్రపంచవ్యాప్తంగా యుద్ధరీతులు మారిపోతున్నాయి.ప్రస్తుతం వచ్చిన అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో ప్రత్యర్థులను చిత్తు చేయడానికి సరికొత్త వ్యూహాలు అవసరమవుతున్నాయి. దీనిలో భాగంగా కొత్త దళాలు, సరికొత్త స్ట్రాటజీలు కావాల్సి వస్తోంది. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ లో తీవ్రంగా దెబ్బతిన్న పాక్ సాయుధబలగాలు.. కొత్తగా రాకెట్ ఫోర్స్ అవసరాన్ని గుర్తించాయి. ఈ దిశగా చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇక చైనా అయితే ఇప్పటికే రాకెట్ ఫోర్స్ ను తయారు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ పరిస్థితుల్లో మన దేశానికి కూడా.. దేశ రక్షణ కోసం ప్రత్యేకంగా ఒక రాకెట్ ఫోర్స్ కమాండ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది స్పష్టం చేశారు. మారుతున్న భద్రతా పరిస్థితుల్లో ఇది వ్యూహాత్మకంగా చాలా కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్మీ డే సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు.
ప్రస్తుత యుద్ధ క్షేత్రంలో రాకెట్లు, మిసైళ్ల మధ్య వ్యత్యాసం తగ్గిపోయిందని, రెండూ నిర్ణయాత్మక ఫలితాలను ఇవ్వగలవని జనరల్ ద్వివేది పేర్కొన్నారు. మన పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్‌లు ఇప్పటికే ప్రత్యేక రాకెట్ ఫోర్స్ లను ఏర్పాటు చేశాయని, వాటికి దీటుగా భారత్ కూడా అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన నొక్కి చెప్పారు. ఈ దిశగా సైన్యం తన దీర్ఘ శ్రేణి దాడి సామర్థ్యాలను గణనీయంగా పెంచుకుంటోందని తెలిపారు.
స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన పినాకా రాకెట్ వ్యవస్థను ఇప్పటికే 120 కిలోమీటర్ల శ్రేణితో విజయవంతంగా పరీక్షించామని, దాని సామర్థ్యాన్ని 150 కిలోమీటర్లకు పెంచేందుకు ఒప్పందాలు కూడా జరిగాయని జనరల్ ద్వివేది వివరించారు. భవిష్యత్తులో దీని శ్రేణిని 300 నుంచి 450 కిలోమీటర్లకు పెంచే లక్ష్యంతో పనిచేస్తున్నామని అన్నారు. పినాకా, ప్రళయ్, బ్రహ్మోస్ వంటి శక్తివంతమైన వ్యవస్థలను సమన్వయం చేస్తూ ఈ రాకెట్ ఫోర్స్ కమాండ్‌ను ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు.
ఇటీవల జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’ గురించి మాట్లాడుతూ, పాకిస్థాన్ నుంచి వచ్చిన అణు బెదిరింపులు కేవలం రాజకీయ స్థాయిలోనే ఉన్నాయని, సైనిక స్థాయిలో (డీజీఎంవోల మధ్య) అలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. ఆ ఆపరేషన్ సమయంలో భారత దళాలు కేవలం 88 గంటల్లోనే భూతల దాడులకు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాయని, పాకిస్థాన్‌కు భారీ నష్టం కలిగించాయని గుర్తుచేశారు. ఈ ఆపరేషన్ తర్వాత, పాకిస్థాన్ కూడా ప్రత్యేక రాకెట్ ఫోర్స్ ఏర్పాటు దిశగా ఆలోచిస్తోందని నివేదికలు వస్తున్నాయని ఆయన తెలిపారు.






