TANTEX: టాంటెక్స్ నూతన అధ్యక్షురాలిగా మాధవి లోకిరెడ్డి బాధ్యతల స్వీకారం
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (TANTEX) నూతన అధ్యక్షురాలిగా మాధవి లోకిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. 1986లో ప్రారంభమై 40 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ సంస్థకు 2026 సంవత్సరానికి నాయకత్వం వహించడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. డాలస్-ఫోర్ట్ వర్త్ నగరాల్లో నివసిస్తున్న తెలుగు వారికి, అలాగే సంస్థ సభ్యులకు ఆమె సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతిని కాపాడటమే కాకుండా, రాబోయే ఏడాదిలో యువజన నైపుణ్యాభివృద్ధి, సరికొత్త సాంస్కృతిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల ద్వారా తెలుగు కమ్యూనిటీని మరింత బలోపేతం చేస్తానని ఆమె పేర్కొన్నారు. గత నాలుగు దశాబ్దాలుగా సంస్థను నడిపించిన మాజీ అధ్యక్షులకు, కార్యవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ, అందరి సహకారంతో టాంటెక్స్ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తానని మాధవి లోకిరెడ్డి వెల్లడించారు.






