Nara Lokesh: కొత్త ఎమ్మెల్యేలకు అవగాహన అవసరం : మంత్రి లోకేశ్
తొలిసారి గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలకు మంచిచెడులు తెలియడం లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. అవగాహనా రాహిత్యం, అనుభవలేమితో సమన్వయం ఉండట్లేదని వ్యాఖ్యానించారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పలువురు మంత్రులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు సీనియర్ ఎమ్మెల్యేలు (Senior MLAs), నేతల అవగాహన కల్పించాలని సూచించారు. ఎమ్మెల్యేగా గెలిచిన కొత్తలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఎలాంటి సమస్యలను అధిగమించి ఈ స్థాయికి వచ్చారనే విషయాలపై కొత్త ఎమ్మెల్యేలకు అవగాహన అవసరమని చెప్పారు. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు వరుస విజయాలు కొనసాగించాలంటే లోటుపాట్లు సరిచేసుకోవాలన్నారు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖ (Visakhapatnam) వేదికగా జరిగే పెట్టుబడుల భాగస్వామ్య సదస్సును కలిసికట్టుగా విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి దాదాపు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. వీటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రతి మంత్రీ తమ శాఖల పరిధి ఒప్పందాలకు సంబంధించి బాధ్యతతో వ్యవహరిద్దామని చెప్పారు. మంగళవారి నిర్వహించే ఎంఎస్ఎంఈ (MSME) పార్కుల కార్యక్రమంలో మంత్రులంతా విధిగా పాల్గొనాలని సూచించారు. తమ జిల్లాల పరిధిలో సంస్థలు గ్రౌండ్ అయ్యేలా మంత్రులు (Ministers), ఇన్ఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన హామీని త్వరగా నెరవేరుద్దామన్నారు.







