Bihar: అలాంటి పరిస్థితులు బిహార్‌లో తెచ్చుకోవద్దు : లోకేశ్
బిహార్‌లో ఎన్డీయే ప్రభుత్వాన్ని మరోసారి అధికారంలోకి తేవాల్సిన బాధ్యత రాష్ట్ర యువతపై ఉందని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) పిలుపునిచ్చారు. బిహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్నా (Patna) లో నిర్వహించిన మీడియా సమావేశంలో లోకేశ్ మాట్లాడారు. ఒక్క ఛాన్స్ పేరుతో 2019లో ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ (YCP) ప్రభుత్వానికి అవకాశం ఇవ్వడం వల్ల, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించి పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తీవ్రంగా నష్టపోయింది. అలాంటి పరిస్థితులు బిహార్ (Bihar)లో తెచ్చుకోవద్దు అని కోరారు. వికసిత భారత్ లక్ష్యసాధనలో బిహార్ పాత్ర చాలా కీలకం. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఎన్డీయేకు అధికారం ఇవ్వాలి. రాష్ట్రాలు బలంగా ఉంటేనే భారతజాతి బలోపేతమవుతుంది అని పేర్కొన్నారు. బిహార్‌లోని ఒక పార్టీ ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెబుతోంది. ఆచరణ సాధ్యం కాని హామీలను యువత నమ్మొద్దు. డబుల్ ఇంజిన్ సర్కారు కారణంగానే బిహార్, ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి పెద్దఎత్తున నిధులు లభిస్తున్నాయని తెలిపారు.






