Karnataka: కర్నాటకలో సీఎం మార్పు ఖాయమైందా..?
కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (CM Siddaramaiah) మార్పుపై కొంతకాలంగా ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఇవి ఇప్పుడు మరింత వేడెక్కాయి. కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తికానున్న నేపథ్యంలో సీఎం మార్పు ఖాయమనే ప్రచారం జోరందుకుంది. ప్రత్యేకించి ఈ నెలాఖరులో ఈ మార్పు ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. నవంబర్ రెవల్యూషన్ పేరుతో ఓ వర్గం దీన్ని విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah), ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) ఢిల్లీ పర్యటనలు, వారి మధ్య అంతర్గత పోరుకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి.
సీఎం సిద్ధరామయ్య తన పనితీరుపై పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఐదేళ్లపాటు తానే అధికారంలో ఉంటానని ఆయన పలు సందర్భాల్లో గట్టిగా ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం ద్వారా సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందిందని ఆయన మద్దతుదారులు నమ్ముతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఐదు ప్రధాన గ్యారంటీ పథకాలను విజయవంతంగా అమలు చేస్తోందని, ఇది ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకాన్ని పెంచిందని ఆయన వర్గం భావిస్తోంది. అయితే, ఆయనపై అసంతృప్తి కూడా లేకపోలేదు. మంత్రివర్గ కూర్పులో, పరిపాలనలో సిద్ధరామయ్య తన వర్గానికి పెద్దపీట వేశారని, డీకే శివకుమార్ మద్దతుదారులకు తగిన ప్రాధాన్యం దక్కలేదని మొదటి నుండి ప్రచారం ఉంది.
కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ సీఎం పీఠంపై తన ఆశలను ఎన్నడూ దాచుకోలేదు. ఎన్నికల ముందు, పార్టీలో అధికారం పంచుకోవడానికి రెండున్నరేళ్ల ఒప్పందం కుదిరిందని డీకే శివకుమార్ వర్గం నమ్ముతోంది. ఈ నెలాఖరుకు సిద్ధరామయ్య పదవీకాలం రెండున్నరేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో, ఆయన ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం క్యాంప్‌నకు చెందిన ఎమ్మెల్యే రాఘవేంద్ర హిట్నాల్ ఓ విందు ఏర్పాటు చేశారు. ఇది సిద్ధరామయ్య వర్గం బలప్రదర్శనగా భావిస్తున్నారు. మరోవైపు డీకే వర్గం కూడా తమ బలాన్ని పెంచుకునే దిశలో పావులు కదుపుతోంది. ఈసారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే, తనకు మద్దతుగా ఉండే నాయకులకు పెద్దపీట వేయాలని ఆయన యోచిస్తున్నారు.
డీకే శివకుమార్ వారం వ్యవధిలో రెండుసార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లడం, పార్టీ అధిష్ఠానంతో నిరంతరం సంప్రదింపులు జరపడం రాష్ట్రంలో జోరుగా ఊహాగానాలకు తెరలేపింది. డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రి పీఠం అప్పగించేందుకు హైకమాండ్ సానుకూలంగా ఉందనే ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓ పుస్తకావిష్కరణలో పాల్గొనేందుకు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఆ సందర్భంగా హైకమాండ్ తో భేటీ అయ్యేందుకు ఆయను వర్తమానం పంపించారు. కానీ సిద్ధరామయ్యతో సమావేశానికి హైకమాండ్ నిరాకరించినట్లు సమాచారం. ఇప్పుడు కలవాల్సిన అవసరం లేదని సిద్ధరామయ్యకు అపాయింట్మెంట్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీంతో సిద్ధరామయ్య మార్పు ఖాయమనే ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి.
అయితే ముఖ్యమంత్రి మార్పుపై అధిష్టానానిదే తుది నిర్ణయం అని కర్నాటక కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వంటి కీలక నేతలు కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్తున్నారు. బిహార్ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే రాహుల్ గాంధీ (Rahul Gandhi) విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఆయన లేకుండా కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్సే లేదు. కాబట్టి ఈ నెలాఖరులోనే ఎలాంటి నిర్ణయమైనే వెలువడే అవకాశం ఉంటుంది. బీహార్ ఫలితాల అనంతరం కర్నాటకలో పెనుమార్పులు ఉండొచ్చని మాత్రం కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.







