Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ఏర్పాట్లు పూర్తి … రేపు ఉదయం 7 గంటల నుంచి
జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రేపు (మంగళవారం) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4 లక్షల 1,365 మంది ఓటర్లు ఉన్నారు. 58 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఎన్నికల కోసం 407 పోలింగ్ కేంద్రాలనుు ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో నాలుగు ఈవీఎం (EVM)లను ఏర్పాటు చేశారు. కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియం (Kotla Vijaya Bhaskar Reddy Stadium) నుంచి పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలింపు ప్రక్రియ మొదలైంది. సిబ్బందికి ఈవీఎంలు, పోలింగ్ సామాగ్రిని అధికారులు పంపిణీ చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం కల్లా పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు తరలించనున్నారు.
3 వేల మంది పోలింగ్ సిబ్బంది, 2 వేల మంది పోలీసులతో కలిపి మొత్తం 5 వేల మంది పోలీసులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విధుల్లో ఉన్నారు. మొత్తం 407 పోలింగ్ కేంద్రాల్లో 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ఈసారి డ్రోన్ల ద్వారా పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణ జరుగనుంది. 103 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. సమస్యత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భద్రత కట్టుదిట్టం చేయనున్నారు. 45 ఫ్లైయింగ్ స్క్వాడ్ టీంలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 230 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేశారు. ఎంసీసీ నిబంధనలు అతిక్రమించిన 27 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.కాగా జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది. బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపినాథ్ భార్య మాగంటి సునీత బరిలో ఉండగా, కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పోటీలో ఉన్నారు.







