BRS – SC: స్పీకర్‌పై సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ధిక్కార పిటిషన్!!
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల (Defected MLAs) అనర్హత పిటిషన్ల వ్యవహారం మరోసారి దేశ సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) గడప తొక్కింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో జాప్యం చేశారంటూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌పై (Telangana Assembly Speaker) కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలైంది. బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తరపున ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు.
తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ తరపున గెలిచిన పది మందికి పైగా ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీఆర్ఎస్, వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. కేటీఆర్ సహా పలువురు నేతలు స్పీకర్‌కు ఫిరాయింపుల నిరోధక చట్టం కింద పిటిషన్లు సమర్పించారు. అయితే, ఈ పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేయడంతో, పిటిషనర్లు హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఏడాది జూలై 31న కీలక తీర్పు వెలువరించింది. ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై దాఖలైన పిటిషన్లపై మూడు నెలల్లోగా విచారణ పూర్తి చేసి నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశించింది. ఏళ్ల తరబడి ఇటువంటి పిటిషన్లను పెండింగ్‌లో ఉంచడం సరికాదని, ఆపరేషన్ సక్సెస్- పేషెంట్ డెడ్ అనే సూత్రం వర్తించకూడదని ధర్మాసనం అభిప్రాయపడింది. అంతేకాకుండా, ఎమ్మెల్యేలు ఎవరైనా విచారణను ఆలస్యం చేయడానికి ప్రయత్నిస్తే, స్పీకర్ వారిపై చర్యలు తీసుకోవాలని కూడా ధర్మాసనం సూచించింది.
సుప్రీంకోర్టు విధించిన మూడు నెలల గడువు ముగిసినప్పటికీ, స్పీకర్ కార్యాలయం విచారణ పూర్తి చేయడంలోనూ, తుది నిర్ణయం తీసుకోవడంలోనూ జాప్యం చేసిందనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో, కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తరపున సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలైంది. అయితే.. స్పీకర్ కార్యాలయం కూడా ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేయడానికి మరింత గడువు కావాలని కోరుతూ ఇప్పటికే సుప్రీంకోర్టులో అదనపు పిటిషన్ దాఖలు చేసింది. అంతర్జాతీయ సదస్సులు, ఇతర కారణాల వల్ల విచారణ పూర్తి చేయలేకపోయామని ఆ పిటిషన్లో స్పీకర్ కార్యాలయం పేర్కొంది.
కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావనకు వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ తరపు న్యాయవాది మోహిత్ రావు తమ కేసును అత్యవసరంగా విచారణ జరపాలని చీఫ్ జస్టిస్ ధర్మాసనాన్ని కోరారు. తమ కేసు తమ ముందు రాకుండా స్పీకర్ కార్యాలయం ప్రయత్నం చేస్తున్నారని కూడా కోర్టుకు తెలిపారు. చీఫ్ జస్టిస్ బి.ఆర్. గవాయ్ ఈ నెల 23న రిటైర్ అవుతున్నందున, ఆ లోపే విచారణ చేపట్టాలని న్యాయవాది అభ్యర్థించారు. దీనిపై స్పందించిన జస్టిస్ గవాయ్ ‘నవంబర్ 24 నుంచి సుప్రీంకోర్టును మూసివేయరు’ అని వ్యాఖ్యానించారు. కేసు విచారణను వచ్చే సోమవారం (నవంబర్ 17న) చేపడతామని చీఫ్ జస్టిస్ ధర్మాసనం స్పష్టం చేసింది.







