Ration Cards: రేషన్ కార్డులపై సీఎం బిగ్ ప్లాన్.. భోగస్ కార్డులకు చెక్, అర్హులకు న్యాయం

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రేషన్ కార్డుల విషయమై కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ (TDP) జనసేన (Janasena) , భాజపా (BJP ) కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ వ్యవస్థను పటిష్టంగా మార్చేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా, కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే అర్హులు అయిన వారు దరఖాస్తులు సమర్పించడం ప్రారంభించారు.
కేవైసీ (KYC) అనే ప్రక్రియను కూడా రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను అనుసరిస్తూ ఈ ప్రక్రియ గత కొన్ని నెలలుగా కొనసాగుతోంది. కేవైసీ ద్వారా అనర్హులైనవారిని గుర్తించి కార్డుల తొలగింపు చేపట్టేందుకు ఇది కీలకంగా మారుతోంది. ఉదాహరణకు, మరణించినవారి పేర్లతో ఇంకా రేషన్ తీసుకుంటున్న వారిని లేదా ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటూనే తప్పుడు చిరునామాలు ఇచ్చి కార్డులు పొందినవారిని ఈ విధానం ద్వారా గుర్తిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ప్రారంభంలో మార్చి (March) చివరితో ముగుస్తుందని ప్రకటించిన కేవైసీ గడువు, ప్రజల అభ్యర్థన మేరకు జూన్ 30వ తేదీ (June 30) వరకు పొడిగించారు. ఇప్పుడు మళ్లీ గడువు ముగిసే సమయం దగ్గరపడుతోంది. కేవైసీ పూర్తి చేయనివారికి రాబోయే రోజులలో ముద్రించబోయే స్మార్ట్ రేషన్ కార్డులు దక్కే అవకాశం ఉండదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇది వారి కార్డు పూర్తిగా రద్దైనట్టే అవుతుందని చెబుతున్నారు.
ఇక కొత్త కార్డుల జారీకి సంబంధించి ప్రభుత్వం మరింత స్పష్టతకు వస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ సిబ్బంది ద్వారా మళ్లీ సర్వే చేపట్టే దిశగా చర్చలు జరుగుతున్నాయి. ఈ సర్వేలో లబ్ధిదారుల జీవన ప్రమాణాలు, ఆదాయ వివరాలు, నివాస సమాచారం వంటి అంశాలపై నిర్ధారణ చేస్తారు. తప్పులు దొరికినవారికి కార్డులు రద్దు చేసి, అర్హులకు కొత్తగా జారీ చేయనున్నారు. ప్రభుత్వానికి అందుతున్న సమాచారం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రెండు లక్షల కార్డులు అనర్హుల చేతుల్లో ఉన్నట్టు అంచనా. మరోవైపు, కొత్తగా మూడు లక్షలమందికి పైగా ప్రజలు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేశారు. దాంతో, ఈ రెండు లక్షల కార్డులను తొలగిస్తూ, కొత్తగా దరఖాస్తు చేసిన వారికి కార్డులు ఇవ్వాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.