YS Jagan: బీజేపీ అభ్యర్థికి వైసీపీ మద్దతుపై సర్వత్రా విమర్శలు!

భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు (vice president elections) ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు (CP Radhakrishnan) వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan) మద్దతు ప్రకటించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arun Kumar), ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాగోర్‌తో (Manikkam Tagore) సహా పలువురు రాజకీయ నాయకులు జగన్ తీరును తప్పుబడుతున్నారు. జగన్ తప్పు చేస్తున్నారని దుయ్యబడుతున్నారు. బీజేపీపై పోరుకు అవకాశం దొరికినా జగన్ తప్పించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.
జగదీప్ ధన్‌ఖడ్ ఊహించని విధంగా పదవి నుంచి తప్పుకోవడంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో ఎన్డీయే (NDA) కూటమి తరఫున మహారాష్ట్ర గవర్నర్, తమిళనాడు బీజేపీ నేత సీపీ రాధాకృష్ణన్ బరిలో నిలిచారు. విపక్ష కూటమి ఇండియా బ్లాక్ తరఫున తెలుగు నేత, మాజీ జడ్జి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి (Justice Sudarshan Reddy) అభ్యర్థిగా నిలిచారు. ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రాంతీయ పార్టీలు తమ మద్దతును ఎవరికి ఇవ్వాలనే చర్చ ఊపందుకుంది.
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ రాజమహేంద్రవరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు తమ పార్టీ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వంటి రాజ్యాంగబద్ధ పదవులు పార్టీలకు అతీతమైనవని, వాటిని గౌరవించాలని జగన్‌మోహన్ రెడ్డి ఎల్లప్పుడూ నమ్ముతారని బొత్స వెల్లడించారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా జగన్‌తో ఫోన్‌లో మాట్లాడి మద్దతు కోరినట్లు కూడా ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయం వైసీపీ రాజకీయ వ్యూహంలో భాగంగా భావించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమితో (టీడీపీ, జనసేన, బీజేపీ) జగన్ సన్నిహితంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాన్ని బలపరిచింది. 2023లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విపక్షాలు తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానంలోనూ జగన్ బీజేపీకి మద్దతు ప్రకటించిన సంగతి గమనార్హం.
వైసీపీ నిర్ణయంపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్‌ను లక్ష్యంగా చేసుకొని, ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకమని, వైసీపీ రాజకీయంగా బలహీనపడుతున్న సమయంలో ఎన్డీయేకు మద్దతు ఇవ్వడం జగన్ రాజకీయ అననుభవాన్ని చాటుతుందని వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడుతూ, “వైసీపీ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఏర్పడిన పార్టీ అని జగన్ స్వయంగా చెప్పుకున్నారు. అలాంటప్పుడు, తెలుగు వ్యక్తి అయిన సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వకుండా ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ప్రకటించడం ద్వారా జగన్ తన రాజకీయ అవకాశాలను స్వయంగా దెబ్బతీసుకున్నారు” అని ఆరోపించారు. ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాగోర్ కూడా జగన్ తీరును తప్పుబట్టారు. “ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది. అలాంటి సమయంలో వైసీపీ ఎన్డీయేకు మద్దతు ఇవ్వడం అంటే ప్రతిపక్షంగా తమ పాత్రను వదులుకోవడమే. ఇది ప్రజల ఆకాంక్షలకు విరుద్ధం” అని విమర్శించారు.
రాజకీయ విశ్లేషకులు జగన్ నిర్ణయాన్ని రెండు కోణాల్లో పరిశీలిస్తున్నారు. జగన్ ఈ నిర్ణయం ద్వారా కేంద్రంలోని బీజేపీ నాయకత్వంతో సన్నిహిత సంబంధాలను కొనసాగించాలని భావిస్తున్నారని కొందరు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత, రాజకీయంగా బలహీనపడిన జగన్, కేంద్రంతో సఖ్యత కొనసాగించడం ద్వారా తమ పార్టీని బలోపేతం చేసుకోవాలని చూస్తున్నారని విశ్లేషణ. అయితే, ఈ నిర్ణయం రాష్ట్రంలో ప్రతిపక్షంగా వైసీపీ బలాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని మరికొందరు హెచ్చరిస్తున్నారు. అయితే 2024లో కేవలం 11 సీట్లకే పరిమితం చేసింది ఎన్డీయే కూటమి. అలాంటి కూటమి అభ్యర్థికే ఇప్పుడు జగన్ మద్దతు పలకడం వైసీపీ రాజకీయ భవిష్యత్తును మరింత దిగజార్చే అవకాశం ఉందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.