Nara Lokesh: ఇన్వెస్ట్‌మెంట్ కు ఎపి బెస్ట్… వస్తున్న పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, భూముల కేటాయింపులు

ఇండియాటుడే కాంక్లేవ్ లో రాష్ట్ర విద్య, ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్
ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు నాయుడు అనే బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారు, ఆ బ్రాండ్ తోనే దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్, డాటా సెంటర్లు, ఐటి కంపెనీలు ఎపిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి, ఎపిలోని పరిశ్రమ అనుకూలమైన వాతావరణం కూడా పెద్దఎత్తున పరిశ్రమల రాకకు ప్రధాన కారణమని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) పేర్కొన్నారు. కోయంబత్తూరులో ‘‘ఎట్రాక్టింగ్ ఇన్వెస్టిమెంట్ ఫర్ ద సన్ రైజ్ స్టేట్’’ అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే నిర్వహించిన కాంక్లేవ్ లో మంత్రి లోకేష్ రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు గత 15నెలలుగా కూటమి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్ సంధానకర్తగా వ్యవహరించారు.
మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… గత ఎన్నికల్లో మేం ఇచ్చిన సూపర్ -6 హామీల్లో ప్రధానమైనది యువతకు 20లక్షల ఉద్యోగాల కల్పన. ఆ లక్ష్యసాధన కోసం మేం ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతున్నాం. టిసిఎస్ సంస్థ 25వేల ఉద్యోగాలు కల్పిస్తుంది… ఆ సంస్థకు 99పైసలకే భూమి కేటాయిస్తే తప్పేమిటి? కర్నాటక, తమిళనాడు, కేరళ, యుపి వంటి రాష్ట్రాలతో పోటీపడి పరిశ్రమలను రప్పించడానికే తక్కువ ధరకు భూమి, ఇతర రాష్ట్రాల కంటే మెరుగైన ప్రోత్సాహకాలు అందిస్తున్నాం.
ఆక్వా ప్రత్యామ్నాయ మార్కెట్ వెదుక్కుంటాం
హైదరాబాద్ లో ఎయిర్ పోర్టు నిర్మాణానికి 5వేల ఎకరాలు ఎందుకని అప్పట్లో చాలామంది రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేశారు, ఈరోజు శంషాబాద్ ఎయిర్ పోర్టు దేశంలోనే అత్యుత్తమ పోర్టుల్లో ఒకటిగా ఉంది. తెలంగాణా రాష్ట్రానికి ప్రధాన ఆదాయవనరుగా మారింది. విజనరీ లీడర్ చంద్రబాబునాయుడు ముందుచూపు వల్లే ఇది సాధ్యమైంది. ఎయిర్ ట్రాఫిక్ రద్దీని తట్టుకునేందుకు ఇప్పుడు బెంగుళూరులో రెండో ఎయిర్ పోర్టు నిర్మిస్తున్నారు. హైదరాబాద్ లో రాబోయే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆనాడు చంద్రబాబుగారు సువిశాలంగా ఎయిర్ పోర్టు నిర్మాణం చేపట్టారని గుర్తుచేశారు. ట్రంప్ సుంకాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఆక్వా మార్కెట్ ను కాపాడుకునేందుకు ప్రభుత్వం తరపున మద్దతు ఇవ్వడమేగాక రష్యా, చైనా, యూరప్ లలో ప్రత్యామ్నాయ మార్కెట్ లు వెదుక్కుంటాం, సవాళ్లను అవకాశంగా తీసుకుంటామని మంత్రి లోకేష్ చెప్పారు. స్టాన్ ఫోర్డ్ లో చదువుతోపాటు యువగళం పాదయాత్ర సవాళ్లను ఎదుర్కొనే మార్గాలను నేర్పించిందని లోకేష్ తెలిపారు.
రాధాకృష్ణన్ కే మా మద్దతు
ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి భారత్ ఫస్ట్ అనే నినాదానికే మేం కట్టుబడి ఉన్నాం. దేశాన్ని ముందుండి నడిపించే నాయకత్వానికే మేం మద్దతు ఇవ్వాలని నిర్ణయించాం. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీజీ నేతృత్వంలో ఎన్ డిఎ అభ్యర్థికి టిడిపి మద్దతు నిస్తుంది. ఎన్ డిఎ అభ్యర్థిగా రాధాకృష్ణన్ ను ప్రకటించగానే ఢల్లీిలో సిపిఆర్ గారిని కలసి అభినందించాం. ప్రధాని మోడీజీ నేతృత్వాన 2029 ఎన్నికల తర్వాత కూడా మా ప్రయాణం కొనసాగుతుంది.
తప్పుచేస్తే ఎవరినీ క్షమించరు
భారత్ మల్టీ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఆవిష్కృతమవున్న తరుణంలో పారదర్శకమైన రాజకీయాలు అవసరమని మేం బలంగా విశ్వసిస్తున్నాం. రాజకీయనాయకులపై ఉన్న కేసులకు సంబంధించి ఏడాదిలోగా విచారణ పూర్తిచేసి, తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టు గతంలో మార్గదర్శకాలు ఇచ్చింది. దురదృష్టవశాత్తు అది అమలు కావడం లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఎవరినీ ఉద్దేశపూర్వకంగా జైలులో పెట్టాలని భావించడం లేదు. ఇదే సమయంలో తప్పుచేసిన శిక్ష అనుభవించక తప్పదు. చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్టు చేశారని మేం ప్రతీకార రాజకీయాలు చేయబోం. నేను తప్పుచేసినా చంద్రబాబు గారు నన్ను జైలుకు పంపుతారు.
మాకు ఎపి ప్రయోజనాలే ముఖ్యం
మాకు ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలే ముఖ్యం. వారిపట్ల మాకున్న నిబద్ధత వల్లే గత 40ఏళ్లుగా వారి హృదయాల్లో చోటు కల్పించారు. తెలుగుదేశం పార్టీ మిగిలిన ప్రాంతీయ పార్టీలకంటే భిన్నమైంది. తరాలు మారినా మేమంతా కలసికట్టుగా ముందుకు సాగుతున్నాం. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో విజేతలైన వారిలో 50శాతం మంది తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలే. 25మంది మంత్రుల్లో 17మంది కొత్తవారు. మేము అంకితభావం కలిగిన కొత్తతరాన్ని రాజకీయాల్లోకి తెస్తున్నాం. మేము కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనప్పటికీ పెట్టుబడుల ఆకర్షణలో ఇతర అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోటీపడుతున్నాం. ఫార్చ్యూన్ 500 కంపెనీలతోపాటు ఇతర ప్రముఖ సంస్థలు ఎపి వైపు చూస్తున్నాయి. స్పేస్ సెక్టార్ అభివృద్ధికి ఇటీవల 200 ఎకరాల భూమి కేటాయించాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ఇది దోహద పడుతుంది. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ సంస్థను కర్నాటక తిరస్కరించాకే మేం ఆహ్వానం పలికాం. ఎంఎస్‌ఎంఇ ఎకో సిస్టమ్ ను అభివృద్ధి చేసేందుకు మా మంత్రి దావోస్ లో పర్యటిస్తున్నారు. హ్యాండ్లూమ్స్, టెక్సైటైల్ రంగాలపై కూడా దృష్టిసారించాం.
రైతుల అంగీకారంతోనే భూసమీకరణ
అమరావతి నిర్మాణానికి రైతుల అంగీకారంతో 35వేల ఎకరాలను సమీకరించాం. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టాం. భారతదేశం అభివృద్ధికి అమరావతి లాంటి మరో వందనగరాల నిర్మాణం జరగాలి. 30ఏళ్లక్రితం హైదరాబాద్, సికింద్రాబాద్ తో పాటు సైబర్ నగర నిర్మాణం జరిగింది. అప్పట్లో కొందరు కంప్యూటర్ అన్నం పెడుతుందా అని అన్నారు. ఇప్పుడు ఐటిలో ఉద్యోగాలు చేస్తున్న లక్షలాది మంది బిడ్డలను చూస్తే కంప్యూటర్ జీవనోపాధికి ఎలా ఉపయోగపడుతుందో తెలుస్తుంది. అటువంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం చంద్రబాబు లాంటి విజనరీ లీడర్ కే సాధ్యమవుతుంది. జనవరిలో అమరావతికి దేశంలోనే మొట్టమొదటి 158 బిట్ క్వాంటమ్ కంప్యూటర్ రాబోతోంది. త్వరలో నైపుణ్యం పోర్టల్ ప్రారంభించబోతున్నాం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వర్టికల్, హారిజంటల్ గా చర్యలు చేపడతున్నామని లోకేష్ చెప్పారు.