ప్రపంచంలోనే అత్యుత్తమం అమరావతి నిర్మాణము…
కృష్ణానది నుంచి అమరావతికి ఎన్ని వారధులు అవసరం అవుతాయో సమగ్ర ప్రణాళికను రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. చెంతనే ఉన్న కృష్ణానది అమరావతి నగరానికి ప్రధాన ఆకర్షణగా చెబుతూ, ఆ నదిపై నిర్మించే వారధులు రాజధానికి మరింత వన్నె తెచ్చే ఆకృతుల్లో వుండాలని స్పష్టంచేశారు. కూచిపూడి ముద్రతో రెండంతస్థులుగా నిర్మించే వారధితో పాటు మరెన్ని వారధులు ఎక్కడెక్కడ అవసరం అవుతాయో గుర్తించాలని అన్నారు. బుధవారం మధ్యాహ్నం వెలగపూడిలో సచివాలయంలో ముఖ్యమంత్రి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) పనుల పురోగతిపై సమీక్ష జరిపారు.
రాజధానిలో ఇక ఏ నిర్మాణాన్ని చేపట్టినా ప్రపంచశ్రేణి (వరల్డ్ క్లాస్) అని కాకుండా ప్రపంచంలోనే అత్యుత్తమం (వరల్డ్ బెస్ట్) అని చెప్పుకునేలా వుండాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అమరావతి ప్రజా రవాణా వ్యవస్థలో చోదకుడు లేని విద్యుత్ బస్సులు, మెట్రో రైలు వుంటాయని తెలిపారు. తక్కువ దూరాలకు జల మార్గాలు వినియోగంలోకి తెస్తామని చెప్పారు. రాజధానిలో ఎక్కడికి వెళ్లాలన్నా కేవలం 30 నిమిషాల వ్యవధిలో చేరుకునేలా ప్రజారవాణా వ్యవస్థ వుండాలన్నారు. బస్ స్టేషన్లు, మెట్రో రైలు స్టేషన్లు, పార్కింగ్ ఏరియాలు అండర్ గ్రౌండులో వుండేలా చూడాలన్నారు. నగరంలోని రహదారి వలయాలు వాహనాలు సులభంగా వెళ్లేందుకు వీలుగా శాస్త్రీయ పద్ధతిలో వుండేలా నిపుణులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా సిటీలో నిర్మాణమయ్యే ఫ్లయ్ వోవర్లు అమరావతి అందాన్ని రెట్టింపు చేసేంతగా ఆకర్షణీయంగా వుండాలన్నారు. రాజధానిలో సైకిల్, నడక మార్గాలలో ఎక్కడా ఎండ కనిపించకుండా నీడనిచ్చే పచ్చని చెట్లు వుండాలని చెప్పారు.
రూ.13.95 కోట్ల వ్యయంతో ‘అమరావతి సిటీ గ్యాలరీ’ని ఏర్పాటు చేస్తున్నామని సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ముఖ్యమంత్రికి వివరించారు. రాజధానికి శంకుస్థాపన జరిగిన ఉద్దండరాయునిపాలెం గ్రామంలో సుమారు 4.5 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటుచేయాలని ప్రాధమికంగా నిర్ణయించామని తెలిపారు.
విజయవాడ నగరంలో గల రాజీవ్ గాంధీ పార్క్, నదీ, కాలువల అభిముఖ ప్రాంతాల అభివృద్ధిపై సమావేశంలో ముఖ్యమంత్రికి ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు. వారధి నుంచి పవిత్ర సంగమం వరకు నదికి ఆనుకుని వున్న ప్రదేశాన్ని పూర్తిస్థాయిలో సుందరీకరించాలని, ఆ ప్రాంతంలో జల క్రీడలు, ఫుడ్ కోర్టులు, షాపింగ్ మాల్స్, ఎమ్యూజ్మెంట్ పార్క్, రోజూవారీ ఎగ్జిబిషన్లు, ఫిట్నెస్ సెంటర్లు, ఓపెన్ ఆడిటోరియాలు, సాంస్కృతిక వేదికలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. నగరానికి ఆవలి వైపున వున్న ప్రదేశంలో సుమారు లక్ష జనాభాకు సరిపోయే 30 వేల ఇళ్లను నిర్మించాలని భావిస్తున్నట్టు ప్రకటించారు. కొత్త రాజధాని ప్రాంతంలోని ఏదైనా ఒక పర్వత ప్రాంతంలో అక్షరధామ్ తరహాలో ఒక దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని తలపోస్తున్నట్టు చెప్పారు. సమావేశంలో పురపాలక మంత్రి పి. నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఎండీ లక్ష్మీపార్ధసారధి, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.













