అవినీతిరహిత రాష్ట్రంగా ఏపీ : చంద్రబాబు
అవినీతిరహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కలెక్టర్లతో సచివాలయంలో అల్పాహార విందు సమవేశాన్ని ముఖ్యమంత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో అత్యుత్తమ పాలన ఎలా అందించాలి, ప్రభుత్వ కార్యక్రమాలను విజయాలను ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలి తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అవినీతికి పాల్పడే ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఆస్తులను స్వాదీన పరుచుకోవాలని కలెక్టర్లకు మార్గదర్శనం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరిగేందుకు అత్యవసర, స్వల్పకాల, దీర్ఘకాల విధానాలను అనుసరించాలని సూచించారు. ఈ రెండేళ్లు ప్రభుత్వానికి చాలా కీలకమని పేర్కొన్న ముఖ్యమంత్రి జీవన ప్రమాణాలు పెంచడంతో పాటు గ్యాస్, విద్యుత్, మరుగుదొడ్లు, సీసీ రహదారులు, ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి వంటి కనీస వసతులను నూరు శాతం కల్పించాలని లక్ష్యం నిర్దేశించారు. సుస్థిర వృద్ధికి సంబంధించి 17 లక్ష్యాలు, సమాజం-కుటుంబ వికాస లక్ష్యాలు, జీవీఏ, జీఎస్డీపీకి అనుగుణంగా పాలన సాగించాలని అన్నారు.













