సీఎం బెయిల్ రద్దు చేయమన్నందుకే… అరెస్టు చేస్తారా?

రాష్ట్రంలో నెలకొన్న రాజ్యాంగ అస్థిరతపై రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని టీడీపీ పొలిటూ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి చింతకాయల అయన్నపాత్రుడు కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వమన్నాక రాజకీయ నాయకులు, ప్రలు అంతా ప్రశ్నిస్తారని, అంతమాత్రం చేత అరెస్టు చేస్తారా? అని మండిపడ్డారు. నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అరెస్టును ఖండించారు. లోక్‍సభ స్పీకర్, కేంద్ర హోంమంత్రి అనుమతి లేకుండానే ఎంపీని అరెస్ట్ చేయడం ఏంటి? అని ప్రశ్నించారు. పోలీస్, సీఐడీ, ఏసీబీ వ్యవస్థలు ముఖ్యమంత్రి చేతిలో కీలుబొమ్మలుగా మారాయని అన్నారు. సీఎం జగన్ వ్యవస్థలను తన గుప్పెట్లో పెట్టుకొని వాటిని నాశనం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. సీఐడీ అధికారులు అక్కడికక్కడే నోటీసులు రాసి ఇంటికి అంటించి రఘురామను అరెస్టు చేశారన్నారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ, పరీక్షల రద్దు గురించి మాట్లాడితే తప్పా? జగన్ బెయిల్ రద్దు చేయమన్నందుకే అరెస్టు చేస్తారా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రతిపక్షనేతగా ఉన్న జగన్, ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును ఉద్దేశించి ఎన్నెన్ని మాటలన్నాడో అందరికి తెలుసు. చీపర్లతో తరిమికొట్టాలని, రాళ్లతో కొట్టాలని, కాల్చిచంపాలని, బంగాళాఖాతంలో విసిరేయాలని చంద్రబాబుకి అంతిమఘడియలు దాపురించాయని ఇలా చాలా అన్నారు. అయినప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి సహృదయంతో తీసుకున్నారు. కానీ రాజకీయ విమర్శలను జగన్ ఓర్చుకోలేకపోతున్నారు అని అన్నారు.