Justice BR Gavai: ఆ తీర్పు ఇచ్చినప్పుడు నన్ను తీవ్రంగా విమర్శించారు : జస్టిస్ బీఆర్ గవాయ్
షెడ్యూల్డ్ కులాల్లోని కొందరికి ఇప్పటికీ రిజర్వేషన్ ప్రయోజనాలు దక్కని పరిస్థితులు ఉన్నాయని, అలాంటివారికి ప్రయోజనం చేకూర్చేందుకు వీలుగా ఉపవర్గీకరణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగిస్తూ తీర్పు ఇచ్చామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ (Justice BR Gavai) గుర్తుచేశారు.భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఏపీలోని మంగళగిరిలో సీకే కన్వెన్షన్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి సీజేఐ (CJI) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా జస్టిస్ గవాయ్ ఇండియా అండ్ ద లివింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ 75 ఇయర్స్ అనే అంశంపై ప్రసంగించారు.
ఎస్సీలకూ క్రీమీలేయర్ వర్తింపజేయాలని చెప్పిన తనను తీవ్రంగా విమర్శించారని, అయినప్పటికీ ఆ తీర్పును ఇప్పటికీ సమర్థించుకుంటున్నానని స్పష్టం చేశారు. హైదరాబాద్ (Hyderabad), బెంగళూరు (Bangalore) వంటి పెద్ద నగరాల్లో విద్యను అభ్యసించే ఐఏఎస్ కుమారుడు, గ్రామంలో ఉండే పేద వ్యవసాయ కూలీ బిడ్డ ఇద్దరూ ఎస్సీ కులాలకు చెందినవారే అయినప్పటికీ, ఇద్దరినీ సమానంగా చూడలేమన్నారు. అలా చూడడం సమాన అవకాశాలు నిరాకరించడమేనని సీజేఐ తేల్చి చెప్పారు.ఈ దేశంలోని చివరి పౌరుడి వరకు న్యాయం అందాలని, ఇది న్యాయవ్యవస్థ బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రాథమిక హక్కుల పరిరక్షణలో కోర్టుల పాత్ర కీలకమని, హక్కుల ఉల్లంఘన జరిగితే కోర్టులను ఆశ్రయించే హక్కు రాజ్యాంగం కల్పించిందన్నారు. మహారాష్ట్రలోని మారుమూల ప్రాంతమైన అమరావతి నుంచి వచ్చి, న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థానాన్ని చేపట్టానంటే, అందుకు భారత రాజ్యాంగమే కారణమని చెప్పారు.






