Modi: చంద్రబాబు, పవన్, జగన్ ప్రత్యేక సందేశాలతో మోదీకి అభినందనలు..

ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా వేడుకల వాతావరణం నెలకొంది. ప్రపంచంలోని పలు దేశాధినేతలు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతుండగా, దేశంలో బీజేపీ (BJP) శ్రేణులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని జనసేవకు అంకితం అయ్యారు. సోషల్ మీడియా (Social Media) వేదికల్లోనూ మోదీ పుట్టినరోజు ట్రెండింగ్‌లో నిలిచి, అనేకమంది అభిమానులు తమ శుభాకాంక్షలను తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సోషల్ మీడియా ద్వారా మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సందేశంలో సరైన సమయంలో దేశానికి సరైన నాయకత్వం దక్కడం భారత ప్రజలకు గొప్ప అదృష్టమని పేర్కొన్నారు. దేశాన్ని స్పష్టతతో, దృఢ సంకల్పంతో ముందుకు నడిపిస్తున్న మోదీ కృషి ప్రతీ పౌరుడి జీవితాన్ని ప్రభావితం చేసిందని అన్నారు. సబ్‌కా సాథ్ – సబ్‌కా వికాస్ (Sabh ka saath Sabh ka vikhas) నినాదంతో ఆయన తీసుకొస్తున్న సంస్కరణలు దేశవ్యాప్తంగా విశేషమైన మార్పులకు దారి తీసాయని గుర్తుచేశారు. మోదీ నాయకత్వం వలన భారత్ (India) అంతర్జాతీయ వేదికపై ప్రతిష్టను సంపాదించిందని, 2047 నాటికి విక్షిత్ భారత్ లక్ష్యం వైపు ఆయన తీసుకెళ్తున్న దిశ ప్రశంసనీయమని పేర్కొన్నారు. మోదీకి మంచి ఆరోగ్యం, నిరంతర శక్తి లభించాలని కోరుకుంటూ చంద్రబాబు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా ప్రత్యేక సందేశం విడుదల చేశారు.మోదీ జీవితం ఒక స్ఫూర్తిదాయకమైన ప్రయాణమని, వినయపూర్వకమైన ప్రారంభం నుండి క్రమశిక్షణతో దేశ నాయకుడిగా ఎదిగిన కథ అందరికీ ప్రేరణనిస్తుందని చెప్పారు. భారత్ పట్ల మోదీ దృష్టి కేవలం పాలనకే పరిమితం కాలేదని, దేశ ఆత్మను మేల్కొల్పి ప్రజలలో గౌరవం, ఐక్యత మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే శక్తిగా మారిందని పవన్ అభిప్రాయపడ్డారు. ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఆయన కృషి, ప్రజల ప్రగతిపట్ల ఉన్న కట్టుబాటు ఎల్లప్పుడూ గుర్తుండిపోతుందని అన్నారు.
అదే విధంగా, ప్రజలతో నేరుగా సంబంధం కలిగి ఉండే వ్యక్తిగా మోదీ ప్రత్యేకతను పవన్ వివరించారు. పగలు రాత్రి విశ్రాంతి లేకుండా కష్టపడుతూ దేశాన్ని ప్రాతినిధ్యం వహించే ఆయనలో ఉన్న సమగ్రత, ఆధ్యాత్మిక బలం ఒకే వ్యక్తి జీవితాన్నే కాకుండా దేశాన్నంతటినీ మార్చగలవని పవన్ పేర్కొన్నారు.ఇక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) కూడా మోదీకి తన శుభాకాంక్షలు తెలిపారు. మోదీ మరింత ఆరోగ్యంగా, ఆనందంగా సుదీర్ఘ కాలం పాటు దేశానికి సేవ చేయాలని ఆయన ఆకాంక్షించారు.ప్రస్తుతం ఈ శుభాకాంక్షలు, ముఖ్యంగా చంద్రబాబు, పవన్ , జగన్ చేసిన ట్వీట్లు సోషల్ మీడియా వేదికలపై వైరల్ అవుతున్నాయి.