Komatireddy: కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి :మంత్రి కోమటిరెడ్డి
అసెంబ్లీకే రాని కేసీఆర్ (KCR) రెండేళ్లలో అధికారంలోకి ఎలా వస్తాడని తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ (Naveen Yadav) కు మద్దతుగా రహమత్‌నగర్ డివిజన్లో మంత్రి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతల సెంటిమెంట్ మాటలు నమ్మితే గోస పడతారంటూ ప్రజలను హెచ్చరించారు. కాంగ్రెస్ అంటేనే సంక్షేమం, అభివృద్ధి అని, పేదలను కడుపులో పెట్టుకొని కాపాడే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు. బస్తీల్లోని పేదలకు మంచి జరగాలంటే నవీన్ యాదవ్‌ను భారీ మెజార్టీతో ఆశీర్వదించాలని కోరారు. అసలైన సర్వేలన్నీ కాంగ్రెస్ గెలవడం ఖాయమని చెబుతుండడంతో బీఆర్ఎస్ నేతలు నైరాశ్యంతో మాట్లాడుతున్నారని, వారి మోసపు మాటలు నమ్మొద్దని ఓటర్లను కోరారు. కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ మహానగర సమగ్ర అభివృద్ధి జరిగిందని పునరుద్ఘాటించారు. ఏమైనా అంటే ఫ్లైఓవర్లు నిర్మించామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన 14కి.మీ పీవీ ఎక్స్‌ప్రెస్ వే ఫ్లైఓవర్, 50 ఫ్లై ఓవర్లతో సమానమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఏడెనిమిది చిన్న ఫ్లైఓవర్లు నిర్మించి గొప్పలు చెబుతోందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతల సెంటిమెంట్ మాటలు నమ్మి మోసపోతే, గోస పడతారని, ఆలోచన చేయాలని ఓటర్లను కోరారు. కంటోన్మెంట్లో జరుగుతున్న దానికి రెట్టింపు అభివృద్ధి జూబ్లీహిల్స్‌లో చేస్తామని స్థానిక ప్రజలకు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.






