Kishan Reddy: ఆ పార్టీతో మాకు ఎలాంటి రహస్య ఒప్పందాలు లేవు : కిషన్ రెడ్డి
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఓడిపోతే సన్న బియ్యం ఆగిపోతాయని సీఎం రేవంత్ (CM Revanth) చెబుతున్నారు. బియ్యం పంపిణీ పథకంలో ప్రతి కిలోకు కేంద్రం రూ.42 రూపాయలు భరిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం భరించేది రూ.15 మాత్రమే. బియ్యం పంపిణీని ఎలా ఆపుతారో మేమూ చూస్తాం అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) సవాల్ విసిరారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ (Meet the Press) కార్యక్రమంలో కిషన్‌రెడ్డి పాల్గొని, పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. మజ్లిస్ పార్టీ (Majlis Party) మెప్పు కోసం సీఎం రేవంత్‌రెడ్డి పని చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ పార్టీలన్నీ తిరిగి ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు. చేతకాని వాళ్లు అనేకం మాట్లాడుతారు. అలాంటి వాటికి సమాధానం చెప్పి సమయం వృథా చేసుకోవడం నాకు ఇష్టం లేదు. వ్యక్తిగత విమర్శలతో కూడిన రేవంత్ వ్యాఖ్యలను సీరియ్‌సగా తీసుకోబోం అని వ్యాఖ్యానించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు రాహుల్ గాంధీ నో చెప్పడం వల్లే సీబీఐకి అప్పగించి చేతులు దులుపుకొన్నారని ధ్వజమెత్తారు. మిగతా అంశాలన్నీ పక్కనపెట్టి, ఒక్క కాళేశ్వరం విచారణను మాత్రమే ఎందుకు అప్పగించారో సీఎం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య సత్సంబందాలు ఉన్నాయనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో త్రిముఖ పోరు నెలకొందని, సర్వే ఫలితాలు నమ్మదగ్గట్టుగా లేవని వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ ఇప్పటికే తమకు మద్దతు తెలపగా, టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఆ పార్టీ నాయకులు తమతో కలిసి పని చేస్తున్నారని వెల్లడించారు. బీఆర్‌ఎ్‌సతో తమకు ఎలాంటి రహస్య ఒప్పందాలు లేవని, భవిష్యత్తులోనూ ఆ పార్టీతో ఎలాంటి పొత్తూ ఉండదని స్పష్టం చేశారు.







