నారా దేవాన్ష్ పేరుతో అన్నదానం
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు, ఎమ్మెల్సీ లోకేశ్ కుమారుడు నారా దేవాన్స్ పేరిట రూ.25 లక్షల విరాళాన్ని సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం కొత్తగా ప్రవేశపెట్టిన దాతల నిర్వహణ వ్యవస్థ (డోనర్ మేనేజ్మెంటు సిస్టం) కింద ఆన్లైన్ ద్వారా ఈ మొత్తాన్ని శ్రీవేంకటేశ్వర నిత్య అన్నప్రసాదం ట్రస్టు పేరిట డిపాజిట్ చేసినట్లు తిరుమల జేఈవో శ్రీనివాసరాజు వెల్లడించారు. ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి ఈ మొత్తాన్ని చెల్లించినట్లు తెలిపారు. దేవాన్ష్ మూడో జన్మదినోత్సవం సందర్భంగా తిరుమలలో భక్తులకు మంగళవారం అన్నప్రసాద వితరణ చేయనున్నారు. దాతలు రూ.25 లక్షలు విరాళంగా చెల్లించినట్లైతే ఒక రోజు వారి పేరిట అన్నప్రసాద వితరణ చేస్తామని ఇటీవల కొత్త పథకానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. తొలిసా ముఖ్యమంత్రి కుటుంబం విరాళం అందజేసింది. 2015 అక్టోబరు 18న తిరుమలలో అన్నప్రాసన సందర్భంగా రూ.20 లక్షలు, గతేడాది జన్మదినం సందర్భంగా రూ.20 లక్షలు చొప్పున దేవాన్ష్ పేరిట అన్నప్రసాదం ట్రస్టుకు సమర్పించారు.






