కార్మికులకు ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుంది : చంద్రబాబు
కార్మికులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని అన్నారు. ప్రపంచమంతా జరుపుకొనే పండుగ మే డే అని అన్నారు. యజమానులు, కార్మికులు కుటుంబసభ్యుల్లా ఉండాలని అన్నారు. కార్మికుల ఆత్మగౌరవాన్ని కాపాడే బాధ్యత యాజమాన్యానిదేనని ఆయన సృష్టం చేశారు. రాష్ట్రంలో కార్మికుల్లో 80 శాతం మంది అసంఘిత కార్మికులు ఉన్నారని, వారు అభద్రతా భావంలో ఉన్నారని, వారికి బీమా సౌకర్యం కల్పించామని తెలిపారు. మొత్తం 2.13 కోట్ల మందికి చంద్రన్న బీమా కల్పించామని తెలిపారు. అన్నిరంగాల్లో మార్పులకు సాంకేతికత కారణంగా నిలుస్తోందని అన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకుంటేనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. కమ్యూనిస్టు దేశం చైనా సాంకేతికతలో దూసుకెళ్తోందని అన్నారు. కార్మికులు చట్టానికి వ్యతిరేకంగా తాత్కాలిక ప్రయోజనాల కోసం పోరాడితే ఫలితాలు సాధించలేరన్నారు. రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు శ్రమించే తొలి కార్మికుడిని తానేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కార్మికులకు న్యాయం చేసేందుకు ప్రత్యేక చట్టాలు తెచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్దమని తెలిపారు. పారిశ్రామికవేత్తల సహకారంతో ప్రతి ఒక్క కార్మికుడికీ సొంత ఇల్లు ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.













