Chandrababu: కేడర్‌కు పెద్ద పని పెట్టిన చంద్రబాబు.. 23 నుంచి నెలరోజులు జనంలోనే..!!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu) టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలు, గ్రామస్థాయి కార్యకర్తలతో జరిపిన టెలీకాన్ఫరెన్స్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం (NDA Govt) ఏడాది కాలంలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆదేశించారు. ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 23 నుంచి నెల రోజుల పాటు ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను వివరించాలని సీఎం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకుడి నుంచి కార్యకర్త వరకు అందరూ పాల్గొని, ప్రచారంలో పోటీపడి పనిచేయాలని ఆయన ఆదేశించారు.
మహానాడు విజయవంతమైనప్పటికీ, సేద తీరకుండా పార్టీ సంస్థాగత కమిటీలను పూర్తి చేయాలని సీఎం సూచించారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు అవకాశాలు కల్పించాలని, అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని కమిటీల్లో స్థానం ఇవ్వాలని ఆదేశించారు. కుటుంబ సాధికార సారధిలో ఉంటేనే పదవులు వస్తాయి. కార్యకర్తలు ఎల్లప్పుడూ డైనమిక్‌గా ఉండాలి అని ఆయన పేర్కొన్నారు. జూలై నుంచి కార్యకర్తలు, నేతలకు నాయకత్వ శిక్షణా శిబిరాలు నిర్వహిస్తామని, కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతిరోజూ పార్టీ కార్యక్రమాలకు సమయం కేటాయించి, ప్రజలతో కలిసిమెలసి ఉండాలని సూచించారు.
రాష్ట్రంలో పెద్ద ఎత్తున ‘యోగాంధ్ర’ (Yogandhra) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ నెల 21న విశాఖపట్నంలో ప్రపంచ యోగా దినోత్సవాన్ని 5 లక్షల మందితో నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మంది పాల్గొనే లక్ష్యంతో ఇప్పటికే 2.21 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మూడు రోజులు యోగాలో పాల్గొనేవారికి సర్టిఫికేట్ ఇస్తామని, యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. “హెల్తీ, వెల్దీ, హ్యాపీ సమాజం కోసం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పటంలో నిలిపే ఉద్యమం” అని ఆయన అన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేసినట్లు సీఎం తెలిపారు. 67.27 లక్షల మంది విద్యార్థులకు రూ.10 వేల కోట్లు విడుదల చేశామని, తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు, పాఠశాలల అభివృద్ధికి రూ.2 వేలు కేటాయించామని వివరించారు. గత ప్రభుత్వం 42 లక్షల మందికి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేయగా, కూటమి ప్రభుత్వం 25 లక్షల మంది అదనంగా లబ్ధి పొందేలా చేసిందని… రూ.8,747 కోట్లు ఖర్చు చేస్తూ గత ప్రభుత్వం కంటే రూ.3,205 కోట్లు అదనంగా వెచ్చిస్తున్నామని చెప్పారు.
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కింద ఏడాదికి రూ.34 వేల కోట్లు, అన్నాక్యాంటీన్ల ద్వారా 4 కోట్ల భోజనాలు సరఫరా చేసినట్లు సీఎం తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని ఈ నెల 20న ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఆర్థిక ఇబ్బందులు, గత ప్రభుత్వం విచ్చలవిడి అప్పులు ఉన్నప్పటికీ, సూపర్-6, మేనిఫెస్టో హామీలను ఏడాదిలోపే అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, సూపర్-6, బాబు ష్యూరిటీ-భవిష్యత్ గ్యారంటీ హామీలను అమలు చేస్తున్న వైనాన్ని వివరించాలని సీఎం కోరారు. ఏడాది పాలన పూర్తైన సందర్భంగా నేతలు, కార్యకర్తలు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.