ఏపీలో మరో సంస్థ భారీ పెట్టుబడి
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ ప్లైవుడ్ తయారీ సంస్థ సెంచురీ ఫ్లై రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. వైఎస్సార్ జిల్లా బద్వేల్లో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. సెంచురీ ప్లై బోర్డస్ ఇండియా లిమిటెడ్ ప్రతినిధులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిశారు. రాష్ట్రంలో సంస్థ పెట్టుబడి ప్రణాళికలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వివరించారు. ప్లైవుడ్, బ్లాక్ బోర్డ్, మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డ్, పార్టికల్ బోర్డ్‌ల తయారీలో దేశంలో అత్యంత పెద్ద పరిశ్రమగా గుర్తింపు పొందిన సెంచురీ ప్లై బద్వేల్లో మూడు దశల్లో యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది.
తొలి దశ పనులను తక్షణం ప్రారంభించి వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2024 నాటికి 3 దశలు పూర్తి చేయనుంది. ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 3 వేల మందికి, పరోక్షంగా 6 వేల మందికి ఉపాధి లభిస్తుందని కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యమంత్రి కలిసిన వారిలో ఆ సంస్థ సీఎండీ సజ్జన్ భజంకా, ఈడీ కేశవ్ భజంకా, కంపెనీ ప్రతినిధి హిమాంశు షాతో పాటు రాష్ట్ర పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ ఆర్.కరికాల వలవన్ ఉన్నారు.






