AP Politics: 2029కి అసెంబ్లీ సీట్ల పెంపు పై కేంద్రం తాజా క్లారిటీ..షాక్ లో కూటమి..

ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఓ కీలక మలుపు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.2029 నుంచి అసెంబ్లీ స్థానాల పెంపు జరగబోతుందన్న అంచనాల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలూ ముందస్తుగా వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. తాజాగా కేంద్రం నుంచి వచ్చిన సమాచారం ఈ ఊహాగానాలకు తాత్కాలిక బ్రేక్ వేసింది. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుకు గల నిబంధనల ప్రకారం, అది కేవలం జనగణన తర్వాతే సాధ్యమవుతుందని స్పష్టత వచ్చింది. పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సి ఉంటుంది.
ఇందుకోసం ఇప్పటికీ సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు పెండింగ్‌లో ఉండగా, కోర్టు క్లారిటీ ఇచ్చింది. కేంద్రం చేపట్టనున్న జనగణన తర్వాతే కొత్త నియోజకవర్గాల ఏర్పాటు సాధ్యమని తెలిపింది. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా జనాభా లెక్కల షెడ్యూల్‌ను ప్రకటించింది. తొలి దశ జనగణన 2026 అక్టోబర్ నుంచి జమ్మూ కశ్మీర్ (Jammu & Kashmir), హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh), ఉత్తరాఖండ్ (Uttarakhand) వంటి రాష్ట్రాల్లో ప్రారంభం కానుంది. రెండో దశలో 2027 మార్చి నుంచి దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు చేపడతారు.
ఈ ప్రక్రియ పూర్తవ్వాలంటే కనీసం మూడేళ్లు పడుతుందన్న అంచనాలున్నాయి. డిజిటల్ ఫార్మాట్‌లో, మొబైల్ యాప్‌ల ద్వారా లెక్కలు సేకరిస్తున్నందున ఇది కొంత వేగంగా జరిగే అవకాశం ఉంది. అయినా సరే, 2029 ఎన్నికల నాటికి కొత్త నియోజకవర్గాలు అందుబాటులోకి రావడం కష్టం. ఎందుకంటే, లెక్కలు తేలిన తరువాత గణాంకాలపై అధ్యయనం జరగాలి, కమిషన్ ఏర్పడాలి, ముసాయిదా నోటిఫికేషన్ రావాలి, ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలి. ఇలా పూర్తి ప్రక్రియ పూర్తి కావాలంటే 2030కి సరే 2034కి కల్లా మాత్రమే ఇది కార్యరూపం దాల్చే అవకాశం ఉంది.
దీంతో, వచ్చే అసెంబ్లీ ఎన్నికలు యధాతధంగా 175 నియోజకవర్గాలతోనే జరిగే అవకాశం ఉంది. ఇది కూటమి పార్టీల వ్యూహాలపై ప్రభావం చూపనుంది. టీడీపీ (TDP), బీజేపీ (BJP), జనసేన (Janasena) కలిసి పోటీ చేస్తే… సీట్ల పంపకంపై పలు మలుపులు తలెత్తే అవకాశం ఉంది. టీడీపీ కొన్ని సీట్లను విడిచిపెట్టాల్సి వస్తే, అంతర్గత అసంతృప్తికి దారి తీయవచ్చు. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)కి అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే వైసీపీ కొన్ని నియోజకవర్గాల్లో సమన్వయకర్తలను ప్రకటించి ముందస్తు ప్రణాళికను అమలు చేస్తోంది. 2029 ఎన్నికల గేమ్ ప్లాన్‌లో ఈ పరిణామాలు కీలక పాత్ర పోషించనున్నాయి.