AP Liquor Scam: లిక్కర్ కేసులో కొత్త మలుపు.. మిథున్ రెడ్డి సహా నలుగురికి బెయిల్‌కి గ్రీన్ సిగ్నల్..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో లిక్కర్ స్కాం (Liquor Scam) చుట్టూ రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కింది. శనివారం ఉదయం ఎంపీ మిథున్ రెడ్డి (Mithun Reddy) కు మధ్యంతర బెయిల్ లభించడం ఒక ప్రధాన పరిణామం కాగా, కొద్ది గంటల వ్యవధిలోనే ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న మరో ముగ్గురికి కూడా బెయిల్ మంజూరు కావడం చర్చనీయాంశమైంది.
ఏసీబీ (ACB) కోర్టు తీర్పుతో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి (Dhanunjaya Reddy), మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రభుత్వంలో ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి (Krishnamohan Reddy), బాలాజీ గోవిందప్ప (Balaji Govindappa) లకు షరతులతో కూడిన బెయిల్ లభించింది. కోర్టు వీరికి ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున బాండ్ , రెండు షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. అంతేకాకుండా పాస్‌పోర్టులను కోర్టులో జమ చేయాలని కూడా స్పష్టం చేసింది.
లిక్కర్ కేసు దర్యాప్తులో ఈ ముగ్గురు పేర్లు కీలకంగా ప్రస్తావనకు వచ్చాయి. ముఖ్యంగా నగదు లావాదేవీల్లో ధనుంజయ రెడ్డి పాత్రపై సిట్ (SIT) ఇప్పటికే చార్జ్‌షీట్‌లో ప్రస్తావించింది. అలాగే జగన్ మాజీ ఓఎస్డీగా పని చేసిన కృష్ణమోహన్ రెడ్డి పేరు కూడా కేసులో ప్రాముఖ్యత సంతరించుకుంది. బాలాజీ గోవిందప్పకు సంబంధించి కూడా కొన్ని కీలక అంశాలను అధికారులు దర్యాప్తులో ఉంచారు.
గత 120 రోజులుగా ఈ ముగ్గురు రిమాండ్‌లోనే ఉన్నారు. మూడు సార్లు బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ ఫలితం రాలేదు. అయితే తాజాగా వారి తరఫున న్యాయవాదులు వినిపించిన వాదనలు కోర్టును ప్రభావితం చేశాయి. ముఖ్యంగా 90 రోజులకు పైగా రిమాండ్ కొనసాగుతోందని, విచారణలో పెద్దగా కొత్త పురోగతి లేదని వాదించడం వల్ల కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఇక ఇదే రోజున ఎంపీ మిథున్ రెడ్డి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమతిస్తూ మధ్యంతర బెయిల్ లభించడం మరో ఆసక్తికర పరిణామంగా మారింది. ఆయనకు ఈ నెల 9న జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించగా, 11న తిరిగి కోర్టుకు లొంగిపోవాలని ఆదేశించారు. దీంతో ఉదయం ఆయన జైలు నుండి విడుదల అయ్యారు.
మొత్తం కేసులో ఇప్పటి వరకు అరెస్టయిన 12 మందిలో ఎనిమిది మందికి బెయిల్ దక్కింది. దీంతో మిగిలిన నిందితుల భవిష్యత్తు ఏమవుతుందన్న అంశంపై కూడా ఆసక్తి నెలకొంది. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. లిక్కర్ కేసు రాజకీయంగా ఎంత పెద్ద చర్చనీయాంశంగా మారిందో, తాజాగా వచ్చిన ఈ తీర్పులు మరోసారి చూపించాయి.