ఒకేసారి ఎన్నికలకు మేం సుముఖమే
ఒకే దేశం-ఒకేసారి ఎన్నికల నినాదానికి తాము సముఖంగానే ఉన్నట్లు తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రానున్న 15 ఏళ్ల కాలంలో చేపట్టాల్సిన అభివృద్ధికి రోడ్ మ్యాప్, 15 ఏళ్ల దీర్ఘకాలిక ప్రణాళికతో పాటు మధ్య, స్వల్పకాలిక లక్ష్యాలతో రూపొందించే యాక్షన్ ప్లాన్‌పై చర్చించేందుకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ పాలకమండలి మూడో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ అన్ని ఎన్నికలూ ఒకేసారి ఆర్నెళ్లలోపు జరిగిపోతే, మిగతా సమయాన్నంతటినీ అభివృద్ధికి ఉపయోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. తాను కన్వీనర్‌గా స్వచ్ఛ భారత్‌పై నీతి ఆయోగ్‌పై నివేదిక ఇచ్చినట్లు తెలిపారు. తలసరి ఆదాయం ఎంతవరకు పెరగాలనే లక్ష్యంపై సమావేశంలో ప్రజెంటేషన్ ఇచ్చారని తెలిపారు. డిజిటల్ ఇండియాపైనా నివేదిక ఇచ్చినట్లు తెలిపారు. తలసరి ఆదాయంలో రూ.1.22 లక్షలతో ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానంలో ఉందని అన్నారు. అయితే, కొన్ని అంశాలలో వెనుకబడి ఉండటానికి రాష్ట్ర విభజనే కారణమని చెప్పారు. విభజన తర్వాత తొలి ఏడాది 5.8 శాతం వృద్ధిరేటును సాధించిందనీ, వృద్ధి రేటులో దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందు ఉందన్నారు. సంతోషం, సమ్మిళిత వృద్ధితో ముందుకుసాగాలని నిర్దేశించుకున్నట్లు తెలిపారు.













