చదువుకు పేదరికం అడ్డుకాదు : చంద్రబాబు
చదువుకు పేదరికం అడ్డుకాదని ఇప్పుడు ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులంతా ఒకప్పుడు సామాన్య కుటుంబం నుంచి వచ్చినవారేననీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సచివాలయంలో స్టాన్ఫోర్డు ఇన్నోవేటివ్ ఫెలోషిప్ కోసం అమెరికా వెళ్లి 6వారాలు శిక్షణ పొంది వచ్చిన 100 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతోమంది అమెరికా వంటి దేశాలకు వెళ్లి ఇప్పుడు గ్లోబల్ కమ్యూనిటీగా ఎదిగారన్నారు. ఒకప్పుడు బిట్స్‌పిలానీ వంటి ఉన్నత విద్యా అవకాశాలు తెలుగువారే అధికంగా సొంతం చేసుకున్నారని అన్నారు. ప్రస్తుతం స్టాన్ఫోర్డు వంటి పేరొందిన విశ్వవిద్యాలయాల్లో తెలుగువారు అద్భుతంగా రాణిస్తున్నారన్నారు. వెనుకబడిన వర్గాలు, షెడ్యూల్ కులాలవారు కూడా బాగా చదువుకోవాలని సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో ఖర్చుతో వెనుకాడకుండా విదేశాల్లో విద్యావకాశాలను కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రపంచంలో ఏదీ అసాధ్యం కాదని సాధనతో, ప్రయత్నం అన్నీ విజయాలు వరిస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిన విద్యార్థులకు అక్కడ ఉన్న పెద్ద కంపెనీలు అధికంగా జీతాలు చెల్లిస్తున్నాయంటే అది తెలుగువారి సత్తా అన్నారు. ఏపి గ్రోత్ రేట్ 15 ఏళ్లపాట సుసిర్థంగా ఉంటే ఇక రాష్ట్రానికి తిరుగుండదని చెప్పారు. దీనికోసమే తాను అహర్నిశలు కష్టపడుతున్నాననీ పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ లో హైటెక్ సిటీ ఏర్పాటు చేయడానికి ఎంతగా శ్రమించానో ఈ రోజు ఏపీలో ఉన్నత విద్యా సంస్థలు పరిశ్రమలు తేవడానికి ప్రయత్నిస్తున్నానన్నారు.






