ఎదురుదాడికే చంద్రబాబు సిద్ధం

కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఢీ కొట్టేందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధమైపోయారు. వచ్చే ఎన్నికల్లో బిజెపిని దెబ్బతీసేందుకు కల అవకాశాలను అన్నింటిని వినియోగించుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగా వ్యూహాన్ని ఎప్పటికప్పుడు ఆయన మార్చుకుంటున్నారు. ఓవైపు కేంద్రం ఐటీ ఇతర దాడులతో బెదరిస్తున్నా, మరోవైపు ప్రతిపక్షమైన వైఎస్‌ఆర్ కాంగ్రెస్, పవన్ పార్టీలు విమర్శలు, ఆరోపణలతో దాడులు చేస్తున్నా ధైర్యంతో ఎదుర్కోవడంతోపాటు నరేంద్రమోదీని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాకుండా చేయడానికి కృషి చేస్తున్నారు. ఇందుకోసం అవసరమైతే ప్రతిపక్షాలన్నింటినీ కూడదీసుకుని ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలని కూడా భావిస్తున్నారు.
జాతి ప్రయోజనాల దృష్ట్యా రాబోయే ఎన్నికలలో భాజపా నేత త్వంలోని ఎన్డీయే భాగస్వామ్యానికి ప్రత్యామ్నాయంగా ఒక ప్రతిపక్ష కూటమి ఏర్పాటు కావాల్సిన అవశ్యకత ఉందని ఆయన చెబుతూ, ఒక బాధ్యత గల పౌరునిగా కూటమి ఏర్పాటులో తాను కీలకపాత్ర పోషిస్తానని కూడా చంద్రబాబునాయుడు పేర్కొంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రజల విశ్వాసం కోల్పోయారని, మరో ప్రత్యామ్నాయాన్ని ప్రజలు కోరుకుంటున్నారని, అందుకు సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఒక సంచలనాత్మక ప్రతిపక్షాల భాగస్వామ్య కూటమిని ఏర్పాటు చేసేందుకు వివిధ పార్టీలతో ఇప్పటికే చర్చలు ప్రారంభించినట్టు చెప్పారు. ఈ కూటమి ఏర్పాటుకు ప్రధాన మంత్రి అభ్యర్థి ఎంపిక అవరోధ మేమీ కాదని, అభ్యర్థిని ప్రకటించకుండానే యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు కావడం ఖాయమని అన్నారు. ఎన్నికలకు ముందే ప్రధాన మంత్రి అభ్యర్థి ఎంపిక కానంత మాత్రాన ఎదురయ్యే సమస్యలేవీ తనకు కనిపించడం లేదని, ప్రజల అభీష్టం మేరకు కేంద్రంలోని అధికార భాగస్వామ్యాన్ని మార్చేందుకు ఫ్రంట్ ఏర్పాటే శరణ్యమని పేర్కొన్నారు. ప్రధాని అభ్యర్థిత్వాన్ని నిర్ణయించడం అనేది వివిధ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని, అప్పటి వరకు కూటమి ఏర్పాటు ప్రయత్నాలను చేయకుండా ఉండడం సరికాదని ఆయన అన్నారు.
కూటమి ఏర్పాటు విషయమై ఇప్పటికే ఆయన కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో సంప్రదింపులు జరిపారు, ఇతర పార్టీలతో కూడా చర్చలకు దిగారు. ఈ ఫ్రంట్ ఏర్పాటుకు ఆలస్యమైనా ఎన్నికల్లోపు ఏర్పడటం?ఖాయమంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనతో ప్రజలు విసిగిపోయి వున్నారని, నోట్లరద్దు, జీఎస్టీ వంటి ఏకపక్ష నిర్ణయాలతో ప్రజల విశ్వాసాన్ని ఆయన కోల్పోయారని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకు పతనమవుతుండడం, చమురు ధరలపై నియంత్రణ లేకపోవడం వంటి ప్రతికూల పరిస్థితులలో దేశ భవిత ప్రమాదంలో పడిపోయేంత దుస్థితి దాపురించిందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం భాజపాకు అతిపెద్ద అపజయమని, ప్రతికూల ఫలితాలను దేశ ప్రజానీకం చవిచూడాల్సి వచ్చిందన్నారు. మోదీ ఆశించిన నల్లధనం సమస్య మాత్రం అణువంత కూడా తగ్గలేదని, 50 రోజులలో మామూలు పరిస్థితులు నెలకొంటాయని ప్రధాని మోదీ ప్రజలను నమ్మించారని, కానీ నేటికీ ఏటిఎం లలో నగదు లభించక ప్రజలు నానా పాట్లు పడుతున్నారని ఆయన మోదీపై ఎదురుదాడికి దిగుతున్నారు.
బ్యాంకులను ముంచి వేలకోట్ల రూపాయిలలో మోసగించిన బడాబాబులు దేశం విడిచి పారిపోతున్నా ఎన్డీయే ప్రభుత్వం ఏమీ చేయలేక పోయిందని దుయ్యబడుతున్నారు. రూపాయి విలువ రోజురోజుకు దారుణంగా పడిపోతున్నా, పెట్రోలు..డీజిల్ ధరలు అడ్డూఅదుపు లేకుండా పెరిగిపోతున్నా మోదీ ప్రభుత్వం ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉందని విమర్శించారు. కంటి తుడుపు చర్యగా చమురుపై లీటరుకు రూపాయి, రెండు రూపాయిలు తగ్గించి లాభంలేదని, కేంద్రం భారీగా విధిస్తున్న ఎక్సైజ్ సుంకాన్ని గణనీయంగా తగ్గించినప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన తెలిపారు. అదేవిధంగా, యుద్ధవిమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్న రాఫేల్ ఒప్పందం తీవ్ర దుమారం లేపినా ప్రధాని మోడీ ఇంతవరకు నోరు విప్పలేదని, ఈ వ్యవహారంలో తలెత్తిన ఆరోపణలపై స్పందించి వాస్తవాలేమిటో ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మోదీపై వుందని అంటూ, ఈ విషయంలో ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హొలాండ్ ఆరోపణలు వచ్చిన తక్షణమే వివరణ ఇచ్చారని, ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ప్రజల అనుమానాలను నివత్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి ఒక్క పౌరుని వలే తాను కూడా ప్రధాని మోడీ నుంచి ఎంతో మేలు జరుగుతుందని ఆశించానని, నాలుగేళ్ళు వారితో కలిసి ప్రయాణం చేసి భంగపడ్డానని చంద్రబాబు పేర్కొంటున్నారు.
రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం ఎన్డీయే నుంచి వైదొలగక తప్పలేదని, ధర్మపోరాటంతో విభజన హామీలను సాధించుకుంటామని చెప్పారు. కేంద్రం ఇప్పటికైనా దిగివచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి హామీలను అమలు చేయకపోతే కేంద్రంలో తమకు అనుకూలమైన ప్రధాని వచ్చేందుకు దేశంలోని ప్రతిపక్షాలను ఏకం చేస్తానని సీఎం చంద్రబాబు చెప్పారు. ఏవిధంగా కేంద్రంలో ప్రత్యామ్నాయ ప్రతిపక్ష భాగస్వామ్యాన్ని ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించగా, తనకు 40 ఏళ్ళ రాజకీయ అనుభవం వుందని, 1995 లో ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యానని, ఎన్డీయే, యుపిఏ కూటముల్లో పనిచేసిన అనుభవం వుందని చెప్పారు. ప్రధాన మంత్రి పదవిని ఆశిస్తున్నారా అని అడుగగా, తాను కేంద్రానికెళ్ళే ఆలోచనే లేదని, ఏ పదవి రేసులో లేనని ఆయన కరాఖండిగా తేల్చి చెప్పారు. ప్రజలు ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారని, ప్రధాని మోడీ విధానాలను రాష్ట్రాలను, ప్రాంతీయ పార్టీల ఉనికి దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు.
దేశంలో ఇటువంటి పరిస్థితి ఇంతకు ముందెన్నడూ లేదని, ఎంతో దయనీయ పరిస్థితి నెలకొని వుందని, ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉన్న బాధ్యతను నెరవేర్చడంతో పూర్తిగా విఫలమైందని చంద్రబాబు అన్నారు. కేంద్రంలోని భాజపా నాయకత్వం అవినీతి పరులతో చేతులు కలిపి ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపిందని, ఫలితం వచ్చే ఎన్నికలలో అనుభవించక తప్పదని ఆయన వ్యాఖ్యానించారు. కనీసం రైతుల కష్టాలను కూడా తీర్చలేని అసమర్థ వైఖరిని ప్రధాని మోడీ ప్రభుత్వం అవలంభిస్తున్నదని, ఇప్పటికి చాలాసార్లు వేలాది మంది రైతులు రాజధాని ఢిల్లి నగరాన్ని ముట్టడిస్తే వారి సమస్యలు పరిష్కరించకపోగా వారిపై దాడులకు తెగబడి వారి విశ్వాసానికి దూరమైందని విమర్శించారు. ఒకపక్క ధరలు పెరిగిపోవడం, మరోపక్క వ్యవసాయ ఉత్పత్తులను కనీస మద్దతు ధరకు కొనలేకపోవడంతో ఆ ప్రభావం ఎగుమతులు, దిగుమతులపై పడుతుందని ఆర్థిక సమస్య మరింత జటిలమవుతుందని చంద్రబాబు వివరించారు.
ఏదీ ఏమైనా వచ్చే ఎన్నికల్లో నరేంద్రమోదీని ఓడించేందుకు తాను శాయశక్తులా కృషి చేస్తానని చంద్రబాబు పేర్కొంటున్నారు.