మే 4 నుంచి సీఎం చంద్రబాబు అమెరికా పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటన షెడ్యూలు ఖరారైంది. మే 4వ తేదీ నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన కోసం రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సోసైటీ(ఏపీఎన్ఆర్టీ) లు పూర్తి ఏర్పాట్లు చేశాయి. మే 6, 7 తేదీల్లో చంద్రబాబు టెక్సాస్, కాలిఫోర్నియాలో ప్రవాసాంధ్ర పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. రాజధాని నిర్మాణం కోసం జరిగిన ప్రగతి, రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలు, రాజధాని ఎలా ఉండబోతోంది తదితర అంశాలపై సీఎం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. చిత్తూరు జిల్లాకు యాపిల్ కంపెనీ తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు ఆ కంపెనీ సీఈఓ, ప్రతినిధులతో సమావేశమయ్యే అవకాశాలున్నాయి. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్, సీఈఓ సత్యనాదేళ్ల, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తదితరులతో సమావేశం కానున్నారు.
మరోవైపు ప్రవాసాంధ్రులతో సమావేశం కావడానికి ఏపీఎన్ఆర్టీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. సమావేశంలో పాల్గొనేవారు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సంస్థ కోరింది. చంద్రబాబుతో జరిగే భేటీలో పాల్గొనే వారి నుంచి స్వచ్ఛందంగా విరాళాలు సేకరిస్తోంది. ముందు వరస సీట్లలో కుటుంబంతో కూర్చొనే వారు వెయ్యి డాలర్లు చెల్లించాలని కోరింది. ముఖ్యమంత్రి అమెరికా పర్యటన వ్యయ భారంలో కొంత భరించాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లు చేశామని ఏపీఎన్ఆర్టీ సీఈఓ డాక్టర్ వేమూరు రవి తెలిపారు.













