గ్రీన్ ఎనర్జీ సిటీగా అమరావతి
రాజధాని అమరావతిలో నిర్మించనున్న ప్రతి ప్రభుత్వ భవనంలోనూ గ్రీన్ ఎనర్జీ అంతర్భాగంగా ఉండేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దేశించారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ, సీఆర్డీఏ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఇంధన రంగం, ఇంధన పొదుపు-సంరక్షణలో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని, ఇదే తరహాలో గ్రీన్ ఎనర్జీలో అమరావతి నగరం మొదటి స్థానంలో నిలవాలన్నారు. అమరావతిని గ్రీన్ ఎనర్జీ నగరంగా మార్చడంలో భాగస్వామ్యం అందించేందుకు స్విట్జర్లాండ్ ప్రభుత్వం ముందుకు రావడం హర్షణీయమన్నారు. ప్రతి నిర్మాణం అందంగా, ఆహ్లాదంగా, విద్యుత్ సంరక్షణ పద్దతులు ఉండేలా డిజైన్ల ఎంపికలో జాగ్రత్త తీసుకోవాలన్నారు. స్విస్ ప్రభుత్వ సంస్థ ఫెడరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారిన్ ఆఫైర్స్ విజయవాడలో మే రెండో తేదీన గ్రీన్ ఎనర్జీపై జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తుండడం మంచి పరిణామమన్నారు. అంతర్జాతీయ సంస్థలు రాజధాని నగరానికి రావడాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఆర్డీఏ అధికారులకు సూచించారు.













