AP vs Karnataka: విశాఖకు టెక్ దిగ్గజం గూగుల్ రాక.. ఆంధ్ర, కర్నాటక మధ్య మాటల యుద్ధం..!

దిగ్గజం గూగుల్.. అమెరికా వెలుపల అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది. దీనికి సంబంధించి ఢిల్లీలో సంతకాలు కూాడా జరిగాయి. అయితే ఈపరిణామం పొరుగున ఉన్న కర్నాటకకు .. అసహనం కలిగిస్తోంది. ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్టులు ఏపీకి పోవడం.. వారికి కాస్త కొరుకుడు పడడం లేదు. దీంతో గూగుల్ కు ఏపీ ప్రభుత్వం బారీగా రాయితీలు ఇచ్చిందంటూ ఓ పుల్లేశారు కర్నాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే(Priyank Kharge).దీనికి ఏపీ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) అంతే ఘాటుగా రిప్లయి ఇచ్చారు.కర్ణాటకలో మౌలిక వసతుల సమస్యలను ఎత్తిచూపారు. దీంతో మరోసారి ఇరు రాష్ట్రాల మధ్య వివాదం రాజుకుంటోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో గూగుల్ భారీ డేటా సెంటర్ ఏర్పాటుతో రూ.1.5 లక్షల కోట్లు పెట్టుబడులకు ముందుకు వచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ప్రపంచం పటంపై వైజాగ్‌కు చోటు లభించిందంటూ ఏపీ వాసులు గర్వంగా పోస్టులు పెడుతున్నారు. అయితే కర్ణాటక మంత్రి మాత్రం భిన్నంగా స్పందించారు. విశాఖపట్నంవైపు గూగుల్ మొగ్గు చూపడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాలు, భారీ రాయితీలే కారణమంటూ ప్రియాంక్ ఖర్గే చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. గూగుల్‌కు రూ.22,000 కోట్ల విలువైన సబ్సిడీలు, పన్నులు, యుటిలిటీ ఫీజుల మినహాయింపు వంటి రాయితీలను ఇచ్చిందని ఆయన విమర్శలు చేశారు. దీనికి ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు.
‘వాళ్లు (కర్ణాటక ప్రభుత్వం) పనితీరు బాగులేకపోతే నేను ఏమి చేయగలను? విద్యుత్ కోతలు సహా అక్కడ మౌలిక వసతులు దారుణంగా ఉన్నాయని వాళ్ల సొంత పారిశ్రామికవేత్తలే అంటున్నారు.. ముందు ఆ సమస్యలను పరిష్కరించుకోవడం వారికి అవసరం’ అని లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. ఇటీవల మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. తమ రాష్ట్రం ఇప్పటికే 120 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులను ఆకర్షించిందన్నారు.
కాగా, ఈ విమర్శలను తిప్పికొట్టిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. బెంగళూరులో మౌలిక వసతులు, స్టార్టప్‌లు, మానవవనరులు, ఆవిష్కరణలతో ఇతర ప్రాంతాలు సరితూగలేవన్నారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపారాలు, పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడానికి వాళ్లు ఏమి చేయాలనుకుంటే అది చేయనివ్వండి’’ అని డీకే స్పష్టం చేశారు. బెంగళూరులో మౌలిక సౌకర్యాలు, రోడ్ల మరమ్మత్తులు శరవేగంగా సాగుతున్నాయని డీకే పేర్కొన్నారు. అయితే కర్ణాటకలో మౌలిక వసతులు ఘోరంగా ఉన్నాయని ప్రతిపక్ష జేడీఎస్ విమర్శలు చేసింది. అస్తవ్యస్తమైన విద్యుత్, నీటి సరఫరా, ఇతర మౌలిక సదుపాయాల వంటి సమస్యలను పరిష్కరించడంలో అధికార కాంగ్రెస్ విఫలమైందని ఆరోపించింది. ఫలితంగా లక్షకు పైగా కోట్ల పెట్టుబడులు.. వేరే రాష్ట్రానికి తరలిపోయాయన్నారు జేడీఎస్ నేతలు.
ఇదే సమయంలో బెంగళూరు నగరంలో రహదారులు, మౌలిక వసతుల గురించి విదేశీ క్లయింట్ ఒకరు వ్యాఖ్యలు చేసినట్టు బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ షా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీనికి ముందు బెంగళూరు నగరంలో మౌలిక సౌకర్యాలు, రోడ్ల దుస్థితిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల ఫోరమ్ లేఖ రాసింది. తమకు మెరుగైన మౌలిక వసతులు కల్పించకుంటే బెంగళూరు మహానగర పాలక యంత్రాంగానికి ఆస్తి పన్ను చెల్లించబోమని హెచ్చరించారు.
వాస్తవానికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల మధ్య వివాదం సెప్టెంబరు మధ్యలో బెంగళూరుకు చెందిన లాజిస్టిక్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు రాజేశ్ యాబాజి ఎక్స్‌లో చేసిన పోస్ట్‌తో మొదలైంది. అధ్వాన్నమైన రహదారులు, భారీ ట్రాఫిక్ కారణంగా బెల్లందూర్ ఏరియాలో ఉన్న తన కార్యాలయానికి రోజూ వెళ్లడానికి ఎక్కువ సమయం పడుతోందని ఆవేదన వెళ్లగక్కారు. దీనికి నారా లోకేశ్ స్పందిస్తూ.. విశాఖకు మీకు అనువైన నగరమని, అక్కడకు రావాలని ఆఫర్ చేశారు.
‘వ్యాపారాలకు గమ్యస్థానంలో అనంతపురం ఒకటి.. ఇది విశాఖ కంటే బెంగళూరుకి దగ్గరగా ఉంది. ప్రపంచ స్థాయి ఏరోస్పేస్, రక్షణ వ్యవస్థ ఏర్పాటవుతోంది’ అని లోకేశ్ చెప్పారు. దీనిపై కర్ణాటక తీవ్రస్థాయిలో స్పందించింది. ‘బలమైన వ్యవస్థలపై ఆధారపడి బలహీనమైన వ్యవస్థలు పబ్బం గడుపుకుంటున్నాయి’ అని మంత్రి ప్రియాంక్ ఖర్గే విమర్శించారు. అలాగే, నగర జీడీపీ 2035 వరకు ఏటా 8.5 శాతం పెరుగుతూ, ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా మారే అవకాశాన్ని చూపిస్తుందని పేర్కొన్నారు.