పవన్ శాఖలకు కేంద్రం అవార్డుల పంట..!
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ జాతీయ స్థాయిలో వరుసగా రెండో ఏడాది కూడా తన ఆధిపత్యాన్ని చాటుకుంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రకటించిన ‘నేషనల్ పంచాయతీ అవార్డ్స్-2025’లో( ఏపీ మొత్తం 5 ప్రధాన పురస్కారాలను కైవసం చేసుకుంది. ఈ ఘనతతో దేశవ్యాప్తంగా అత్యధిక అవార్డులు సాధించిన రాష్ట్రాల జాబితాలో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఈ శాఖ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి అట్టడుగు స్థాయి పాలనలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులకు ఈ అవార్డులే నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు.
ముఖ్యంగా చిత్తూరు జిల్లాలోని కుప్పం(Kuppam) బ్లాక్ పంచాయతీ దేశంలోనే మూడవ ఉత్తమ బ్లాక్ పంచాయతీగా నిలిచి రూ. 1.5 కోట్ల నగదు బహుమతిని గెలుచుకుంది. అలాగే క్లైమేట్ యాక్షన్ విభాగంలో కందులవారిపల్లె, ఆత్మనిర్భర్ విభాగంలో కాణిపాకం మరియు సుపరిపాలనలో శృంగవరం వంటి పంచాయతీలు జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకులను సాధించి రాష్ట్ర కీర్తిని దశదిశలా చాటాయి. గత ప్రభుత్వ హయాంలో 24వ స్థానంలో ఉన్న రాష్ట్రం, ఇప్పుడు దేశంలోనే అగ్రగామిగా నిలవడం గమనార్హం.
వీటితో పాటు సంస్థల విభాగంలో చిత్తూరు జిల్లా పంచాయతీ రిసోర్స్ సెంటర్కు జాతీయ స్థాయి అవార్డు దక్కడం విశేషం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 23 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం 19 జాతీయ అవార్డులను సాధించి రికార్డు సృష్టించింది. క్షేత్రస్థాయిలో పాలనను మెరుగుపరచడం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించడంతో ఈ స్థాయిలో అవార్డులు సాధ్యమయ్యాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
23 ఆగస్టు 2024న రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామాల్లో ఏకకాలంలో గ్రామసభలు నిర్వహించి World Records Union నుండి ప్రపంచ రికార్డును సొంతం చేసుకోవడం ఒక మైలురాయిగా నిలిచింది. ఈ సభల ద్వారా రూ. 4,500 కోట్ల విలువైన ఉపాధి హామీ పనులకు ఆమోదం తెలపడమే కాకుండా, ప్రజల భాగస్వామ్యంతో కూడిన ‘పల్లె పండుగ’ వంటి వినూత్న కార్యక్రమాలను ఆయన పట్టాలెక్కించారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి ఈ అవార్డులు నిదర్శనమని అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






