త్వరలోనే అన్ని ఆలయాలకు కొత్త పాలకమండళ్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎనిమిది ప్రధాన దేవాలయాల్లో సౌకర్యాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇతర అంశాలపై సమీక్ష చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి తెలిపారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారిని కుటుంబసమేతంగా ఆయన దర్శించుకున్నారు. ఆలయంలో చేపట్టిన అభివృద్ధి పనులపై అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే అన్ని ఆలయాలకు కొత్త పాలకమండళ్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ప్రభుత్వం మారిన తర్వాత అప్పటి వరకు కొనసాగిన పాలకమండళ్ల సభ్యులు తన పదవీకాలంతో సంబంధం లేకుండా రాజీనామాలు చేయడం నైతిక విలువలు పాటించడం అవుతుంది. లేని పక్షంలో ప్రభుత్వమే తగిన చర్యలు తీసుకుంటుంది. త్వరలోనే సీఎం చంద్రబాబు దేవాదాయశాఖపై సమీక్ష చేస్తారు. ఆయన సూచనల మేరకు ముందడుగు వేస్తాం. కొత్త పాలకమండళ్లను నియమిస్తాం. హిందూ ధర్మంలో ప్రతి ఒక్కరినీ గౌరవించడం మన సంప్రదాయం. ఆలయాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన కోసం తగిన చర్యలు తీసుకుంటున్నాం అని తెలిపారు.