Nara Lokesh: ఏఐ అవకాశాలపై సదస్సులో మంత్రి నారా లోకేష్
కృత్రిమమేథను అనుసరించడం కాదు… మనమే ముందుండి నడిపిద్దాం!
రీ స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ తో భవిష్యత్ అవకాశాలను అందిపుచ్చుకుందాం
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా 9.7 కోట్ల కొత్త ఉద్యోగాలు వస్తాయి
మార్పును అడ్డుకోవడం కాదు… దాని రూపకల్పనలో భాగస్వాములం అవుదాం
విశాఖపట్నం: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఇకపై భవిష్యత్ సాంకేతికత కాదు… అది ఇప్పుడు ఇక్కడే ఉందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ – ఉద్యోగాల భవిష్యత్తు – సవాలును అవకాశంగా మార్చుకోవడం (AI and the Future of Jobs — Turning Disruption into Opportunity) అనే అంశంపై సిఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ ప్రాంగణంలో జరిగిన సదస్సులో మంత్రి లోకేష్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… పారిశ్రామిక విప్లవం వచ్చిన ప్రతిసారి ఉద్యోగాలు పెరుగుతాయి. ఏఐ ఇప్పుడు పరిశ్రమల పనితీరును సమూలంగా మార్చేస్తోంది, ఉత్పాదకతకు పునర్నిర్వచిస్తోంది, పని నియమాలను రాస్తోంది. ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఎఐని మనమే ముందుండి నడిపించడం, లేదా అది చూపిన మార్గంలో నడవడం.
అడ్డంకులు, అసమానతలు లేకుండా ఎఐ ద్వారా మరింత డైనమిక్ గా భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం మన చేతిలో ఉంది. ఇందుకోసం మూడు విభాగాలుగా ఫ్రేమ్ వర్క్ ను రూపొందించుకోవాల్సి ఉంది. 1. పునఃనైపుణ్యం 2).పునఃనిర్వచించడం 3).పునరాలోచించడం (Reskill, Redefine, Reimagine). ఒకసారి నేర్చుకొని జీవితాంతం పనిచేసే కాలం పోయింది. చిరకాల అభ్యాసం ఇక విలాసం కాదు… అవసరం. రీస్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ ద్వారా రేపటి ఉద్యోగాలకు అనువైన ఎకోసిస్టమ్ ను మనం నిర్మించాలి. ఆంధ్రప్రదేశ్లో ఫ్యూచర్ స్కిల్స్ ప్రాజెక్ట్ ఇప్పటికే ప్రారంభమైంది. ఏఐ ఎథిక్స్, డేటా స్టోరీటెల్లింగ్, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, సస్టంజబుల్ టెక్నాలజీ మీద మా ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఎఐ శిక్షణ, నైతిక పర్యవేక్షణ, మానవ యంత్రాల సహకారంతో 2025నాటికి ప్రపంచవ్యాప్తంగా 9.7 కోట్ల కొత్త ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని ఒక అంచనా. భవిష్యత్ సాంకేతికలతో ఉద్యోగాలు పొందటమే కాకుండా, వాటిలో అసాధారణ, చురుకైన పాత్ర పోషించేలా మన యువతను తయారు చేయాలి.
ఎఐ సాంకేతికత భవిష్యత్తుకు ఒక బ్రిడ్జిగా ఉండాలి తప్ప అడ్డంకి కాకూడదు. ఎఐ విప్లవం పట్టణ, గ్రామాల మధ్య, పురుషులు, మహిళలు మధ్య, నైపుణ్యం కలిగిన వారు, వెనుకబడిన వారి మధ్య అంతరాలను పెంచకూడదు. భారతదేశ జనాభాలో 65శాతం మంది 35ఏళ్లలోపు వయస్కులు ఉన్నారు. ఈ డెమొగ్రఫిక్ డివిడెండ్ ను డిజిటల్ లిటరసీ, వొకేషనల్ ట్రైనింగ్, ఎంటర్ ప్రెన్యూరల్ మద్దతుతో భవిష్యత్ వ్యవస్థకు పెట్టుబడిగా మలచుకోవచ్చు. ఈ సమయంలో మనం పెద్దగా ఆలోచించాలి, తెలివిగా పని చేయాలి, తగిన శ్రద్ధ చూపాలి. భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుంది—నేతలు, పాలసీ మేకర్లు, ఉపాధ్యాయులు, పౌరులు దీనిని కొత్తమార్గంవైపు నడిపించాలి. మార్పును అడ్డుకోవడం కాదు… దాని రూపకల్పనలో మనమంతా భాగస్వాములు కావాలి. కొత్త టెక్నాలజీకి భయపడుకుండా దానిని మరింత సౌలభ్యంగా మార్చుకుందామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ‘ఈజ్ ఇండియా రెడీ ఫర్ అథెంటిక్ ఏఐ’ నివేదికను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. అనంతరం నారా లోకేష్ సమక్షంలో భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎండీ, సీఐఐ వైస్ ప్రెసిడెంట్ సుచిత్ర కె.ఎల్లాతో సీఐఐ ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే ఐదేళ్లలో విజయవాడలో 30వేల మంది యువతకు ఉద్యోగ నైపుణ్య శిక్షణ, కెరియర్ కౌన్సిలింగ్, ఉద్యోగాల కల్పన కోసం ఈ ఎంవోయూ చేసుకోవడం జరిగింది.
ఈ సదస్సులో సిఐఐ ప్రెసిడెంట్ రాజీవ్ మెమాని, నీతి ఫ్రంటైర్ టెక్ హబ్ చీఫ్ ఆర్చిటెక్ట్ దేబ్ జానీ ఘోష్, పోర్టులాన్స్ ఇనిస్టిట్యూట్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ సౌమిత్ర దత్తా, వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఎండి జెరేమి జుర్గెన్స్, ఎర్నెస్ట్ అండ్ యంగ్ గ్లోబల్ చీఫ్ ఇన్నొవేషన్ ఆఫీసర్ జోయ్ దేపా, కొరియా యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ షారోన్ బూటీ తదితరులు పాల్గొన్నారు.






