Chandrababu: గైర్హాజరు నేతలపై చంద్రబాబు చర్యలు తీసుకుంటారా..?

అమరావతిలో ఆదివారం జరిగిన తెలుగుదేశం పార్టీ (TDP) విస్తృతస్థాయి సమావేశానికి 56 మంది గైర్హాజరవడం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ 56 మందిలో 15 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉండటం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుని (CM Chandrababu) తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ఈ సమావేశం ఎన్డీఏ ప్రభుత్వం (NDA) ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు జరిగిన కీలక భేటీ ఇది. ఇలాంటి సమావేశానికే నేతలు డుమ్మా కొట్టడం విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులపై అవినీతి, అక్రమాల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వీళ్లపై చంద్రబాబు ఏమైనా చర్యలు తీసుకుంటారా అని వెయిట్ చేస్తున్నారు.
పార్టీ కీలక సమావేశానికి 56 మంది హాజరుకాకపోవడంతో చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “పార్టీ సమావేశం కంటే ముఖ్యమైన పనులు ఏమున్నాయి?” అని ప్రశ్నించిన ఆయన, నియోజకవర్గాల్లో ప్రజలకు దూరంగా ఉంటూ, విదేశీ పర్యటనలకు వెళ్లే ఎమ్మెల్యేలపై మండిపడ్డారు. ఇప్పటికే కొందరు విదేశీ పర్యటనల్లో ఉన్నట్లు తెలిసింది. ఇది చంద్రబాబు మరింత ఆగ్రహానికి కారణమైంది. “ఫారిన్ ట్రిప్పులు వేసే బదులు, రాజకీయాలు మానుకుని విదేశాల్లోనే స్థిరపడితే మంచిది” అని ఆయన వ్యాఖ్యానించినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. “ఇలాంటి వాళ్లు అటు నుంచి అటే వెళ్లిపోవాల్సి ఉంటుంది” అని హెచ్చరించారు. నేతలు ఈ స్థాయిలో గైర్హాజరు కావడం టీడీపీలో క్రమశిక్షణా లోపాన్ని సూచిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలపై అవినీతి, ఇసుక మాఫియా, మద్యం వ్యాపారంలో జోక్యం వంటి ఆరోపణలు ఉన్నాయి. గతంలో చంద్రబాబు ఇలాంటి అవినీతి ఆరోపణలు వచ్చిన ఎమ్మెల్యేలను గుర్తించి, వారిని హెచ్చరించినట్లు సమాచారం.
టీడీపీ సమావేశానికి భారీగా నేతలు గైర్హాజరు కావడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. “పార్టీ సమావేశానికే రాని వాళ్లు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరిస్తారా?” అనే సెటైర్లు వైరల్ అవుతున్నాయి. ప్రజలకు దూరంగా ఉంటూ, పార్టీ అధినేత ఆదేశాలను కూడా లెక్కచేయని ఎమ్మెల్యేలు, ఎంపీలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఇలాంటి నేతలపై పార్టీ ఎలా స్పందిస్తుంది.. గైర్హాజరైన ఎమ్మెల్యేలు, ఎంపీలపై చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఈసారికి క్షమించి వదిలేయవచ్చని, మున్ముందు కూడా ఇలాగే వ్యవహరిస్తే అప్పుడు కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
ఎన్డీఏ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుంది. అమరావతి మళ్లీ పట్టాలెక్కింది. సంక్షేమ పథకాల అమలు, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడంపై చంద్రబాబు దృష్టి సారించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ విజయాలను వివరించాలని, ప్రజలతో సంబంధాన్ని బలోపేతం చేయాలని ఆయన పార్టీ నేతలకు ఆదేశించారు. దాదాపు నెలరోజులపాటు ఈ ప్రోగ్రామ్ జరగనుంది. ఇంటింటికీ వెళ్లకుండా నేతలు ఇంట్లో కూర్చుంటే అలాంటి నేతలపై మాత్రం కఠినంగా వ్యవహరించాలని పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి నెలరోజుల తర్వాత నేతల పనితీరును అంచనా వేసి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.