ఎపీలో 108 అంబులెన్స్…సేవలు భేష్…
లాక్డౌన్, కరోనా విపత్కర పరిస్థితులతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 108 అంబులెన్సులు నిర్వహించిన పాత్రపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. అనారోగ్యానికి గురైన వారు ఏ రవాణా సౌకర్యం లేక ఆస్పత్రులకు ఎలా వెళ్లాలో తెలియక సతమతవుతున్న వేళ క్లిష్ట పరిస్థితుల్లో ఫోన్ చేస్తే కేవలం 20 నిముషాలలోపే ఘటనాస్థలికి వాహనాలు చేరుకుంటూ వచ్చాయి. అర్ధరాత్రైనా అపరాత్రైనా 108కి ఫోన్ కాల్తో సేవలను అందించాయి. ఈ విధంగా మార్చి 4 నుంచి మే 19 వరకు 83,679 మందికి అత్యవసర సేవలు అందించిన ఘనత 108లకే దక్కింది.
కోవిడ్ బాధితులకు ప్రత్యేకం…
కోవిడ్ బాధితుల కోసం ప్రత్యేకంగా కొన్ని అంబులెన్సులు సేవలు అందించగా మిగతావి ఎమర్జెన్సీ సేవలకు వినియోగించారు.అలాగే గర్భిణుల నుంచి పాముకాటు బాధితుల వరకు వేలాది మందిని అత్యవసర సమయంలో ఆస్పత్రులకు చేర్చి అంబులెన్సులు ఆదుకున్నాయి.
తూర్పు గోదావరిలో టాప్…
అనంతపురం జిల్లాలో 2,822 మంది గర్భిణులు 108 వాహనాల్లో అత్యవసరంగా ఆస్పత్రులకు చేరుకోగలిగారు. అలాగే చిత్తూరు జిల్లాలో పాయిజనింగ్ కేసుల్లో 215 మందిని ఈ అంబులెన్సుల్లో చికిత్సకు తరలించారు. అదే విధంగా గుంటూరుకు చెందిన కార్డియాక్ అరెస్ట్ (గుండెపోటు) బాధితులు 355 మంది 108 సేవలు వినియోగించుకున్నారు.ఇక కృష్ణా జిల్లాలో 7,555 మందికి అంబులెన్సులు వివిధ రకాల అత్యవసర సేవలు అందించాయి. శ్రీకాకుళం జిల్లాలో 584 మంది డయాలసిస్ బాధితులు 108 సేవలు వినియోగించుకున్నారు. అయితే అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 9,396 మందికి 108 అంబులెన్సులు సేవలు అందించాయి. మొత్తం 75 రోజుల్లో 83,679 మందికి విపత్కర సమయంలో ఆదుకున్న ‘108’ భరోసా*మార్చి 4 నుంచి వేలాది మందికి దాదాపు 24 వేల మంది గర్భిణులకు 5600 మందికి పైగా రోడ్డు ప్రమాద బాధితులకు, డయాలసిస్ పేషెంట్లకు అత్యవసర చికిత్స అందించడంలో ప్రధాన పాత్ర పోషించాయి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈ అంబులెన్స్ కరోనా సంక్షోభ పరీక్షా కాలంలో తనదైన ప్రత్యేకతను చాటుకుంది.






