Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం – తొలి ఫ్లైట్ కు రంగం సిద్ధం!
ఆంధ్రప్రదేశ్ విమానయాన చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర వాసులు ఎదురుచూస్తున్న కల సాకారం అయ్యే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మితమవుతున్న ‘జీఎంఆర్ విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం’ ట్రయల్ రన్ కు సిద్ధమవుతోంది. దీన్ని భోగాపురం ప్రాంతంలో నిర్మించడంతో అందరూ దీన్ని భోగాపురం ఎయిర్ పోర్టుగా పిలుస్తున్నారు. అయితే దీనికి అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అని నామకరణం చేయనున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 4న ఈ విమానాశ్రయం నుంచి తొలి టెస్ట్ ఫ్లైట్ ఎగరనుంది. ఇది కేవలం ఒక సాంకేతిక ప్రక్రియ మాత్రమే కాదు.. అది ఉత్తరాంధ్ర ప్రగతికి నాంది ప్రస్తావన.
జనవరి 4వ తేదీన భోగాపురం రన్‌వే పై తొలి విమానం దిగనుందని నిర్మాణ సంస్థ జీఎంఆర్ ప్రకటించింది. ఈ అద్భుత ఘట్టాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దగ్గరుండి పర్యవేక్షించనున్నారు. ఈ ట్రయల్ రన్ ద్వారా రన్‌వే నాణ్యత, సిగ్నలింగ్ వ్యవస్థ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పనితీరును పరిశీలిస్తారు. ఇది విజయవంతమైతే, అతి త్వరలోనే పూర్తిస్థాయి వాణిజ్య విమానయాన సేవలు ప్రారంభమవుతాయి. 2026 మే నుంచి ఈ విమానాశ్రయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలనేది ప్రభుత్వ లక్ష్యం.
ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్న విమానాశ్రయం నేవీ ఆధీనంలో ఉండటం వల్ల అనేక పరిమితులు ఉన్నాయి. కానీ, భోగాపురం విమానాశ్రయం పూర్తిస్థాయి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్ పోర్ట్. సుమారు 2,203 ఎకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మిస్తున్నారు. తొలి దశలో ఏటా 60 లక్షల ప్రయాణికుల సామర్థ్యంతో ఇది అందుబాటులోకి వస్తోంది. భవిష్యత్తులో దీనిని ఏటా 40 మిలియన్ల ప్రయాణికుల సామర్థ్యానికి పెంచేలా డిజైన్ చేశారు. ఇందులో నిర్మించిన 3800 కిలోమీటర్ల రన్‌వే ప్రపంచంలోనే అతిపెద్ద విమానమైన ఎయిర్‌బస్ A380 వంటి వాటిని కూడా దించేందుకు అనుకూలంగా ఉంటుంది. కేవలం ప్రయాణికులే కాదు, అంతర్జాతీయ ఎగుమతులు, దిగుమతుల కోసం భారీ కార్గో టెర్మినల్ కూడా ఇక్కడ సిద్ధమవుతోంది.
భోగాపురం విమానాశ్రయం కేవలం ప్రయాణ సౌకర్యం మాత్రమే కాదు, అది ఆర్థిక వృద్ధికి ఇంజిన్ లాంటిది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ఇది ముఖద్వారంగా మారుతుంది. ఫార్మా, ఐటీ, సీ-ఫుడ్ ప్రాసెసింగ్ వంటి పరిశ్రమలకు అంతర్జాతీయ కనెక్టివిటీ పెరిగి, పెట్టుబడులు వెల్లువెత్తుతాయి. అరకు లోయ, విశాఖ బీచ్‌లు, శ్రీకాకుళంలోని పురాతన ఆలయాలకు విదేశీ పర్యాటకుల రాక గణనీయంగా పెరుగుతుంది. ఎయిర్ పోర్ట్ అనుబంధంగా ఏరో సిటీ, హోటళ్లు, లాజిస్టిక్స్ రంగాలు అభివృద్ధి చెంది వేలాది మంది స్థానిక యువతకు ఉపాధి లభిస్తుంది. ఇన్నాళ్లూ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై విమానాశ్రయాలపై ఆధారపడిన కార్గో రవాణా, ఇకపై నేరుగా విశాఖ నుంచే జరిగే ఆస్కారం ఉంది. ముఖ్యంగా నైట్ ల్యాండింగ్ సౌకర్యాలు, 24/7 ఆపరేషన్స్ అందుబాటులో ఉండటం వల్ల అంతర్జాతీయ విమానయాన సంస్థలు భోగాపురం వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.
ఈ ప్రాజెక్టు వేగవంతం కావడంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాత్ర కీలకం. పిన్న వయసులోనే కేంద్ర విమానయాన శాఖ బాధ్యతలు చేపట్టిన ఆయన, తన సొంత ప్రాంతమైన ఉత్తరాంధ్రలో ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఢిల్లీ స్థాయిలొ అనుమతులు త్వరగా మంజూరు చేయించడం, నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు సమీక్షించడం, అడ్డంకులను తొలగించడంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపించారు. విమానయానం సామాన్యుడికి చేరువ కావాలనే ఆయన లక్ష్యానికి భోగాపురం ఒక బలమైన పునాదిగా నిలవనుంది.
మొత్తంగా, భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం. జనవరి 4న జరగబోయే టెస్ట్ ఫ్లైట్ ఆ ప్రాంత అభివృద్ధికి సంకేతం. ఇది పూర్తయి అందుబాటులోకి వస్తే, ఉత్తరాంధ్ర రూపురేఖలే కాకుండా, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిగతులు కూడా సానుకూలంగా మారుతాయని నిస్సందేహంగా చెప్పవచ్చు.






